మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

– విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
– ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విషాదం
– ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా విజయం
– మంత్రిగా, ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు

విశాఖపట్నం, నవంబర్‌ 12 (సేనాని ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగిన ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థానాధీశుడైన విజయరామరాజు 1948 ఆగస్టు 4న జన్మించారు. నియోజకవర్గ సమస్యలపై గళమెత్తుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ ప్రస్థానంలో ఆయనను అనుచరులు, అభిమానులు ‘ఉత్తరాంధ్ర టైగర్‌’, ‘మన్యం పులి’గా పిలుచుకునేవారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్నాయి. విజయరామరాజు తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు శాసనసభ్యుడిగా, మూడుసార్లు పార్వతీపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. వివిధ రాజకీయ పరిణామాల మధ్య పార్టీలు మారినా, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రను కొనసాగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023 వరకు ఆ పదవిలో కొనసాగారు. శాసనసభ, లోక్‌సభ, మంత్రివర్గం, శాసనమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విజయరామరాజు భార్య రాణి శశికళాదేవి. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో వెల్లడించనున్నారు.