మౌనిక కష్టానికి తగిన గుర్తింపు: మంచు మనోజ్‌

మౌనిక కష్టానికి తగిన గుర్తింపు: మంచు మనోజ్‌

హైదరాబాద్‌, నవంబరు 14 (భారత్ ప్రతినిధి): టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ తన సతీమణి భూమా మౌనికపై ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ కలిసి ప్రారంభించిన ‘నమస్తే వరల్డ్‌’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా మౌనిక పడిన కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘నమస్తే వరల్డ్‌’ సంస్థ ప్రభుత్వంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సుమారు రూ.36.24 కోట్ల పెట్టుబడితో కర్నూలు, విశాఖపట్నం నగరాల్లో చేనేత వస్త్రాలు, స్థానిక హస్తకళల బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 950 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కొండపల్లి, ఏటికొప్పాక వంటి సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు స్థానిక కళాకారులకు అండగా నిలవడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విజయంపై మనోజ్‌ స్పందిస్తూ.. గత ఐదేళ్లుగా మౌనిక ఎంతో పట్టుదలతో, అంకితభావంతో పనిచేసిందని తెలిపారు. తిరుపతిలో తొలి ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది వారాల్లోనే మరో కీలక ఒప్పందం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం పూర్తిగా మౌనిక కష్టానికి దక్కిన ఫలితమని కొనియాడారు.
స్థానిక చేనేత కళాకారులు, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను బొమ్మలు, యానిమేషన్‌, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతతో నేటి తరానికి పరిచయం చేయాలన్నది ‘నమస్తే వరల్డ్‌’ ప్రధాన ఉద్దేశం. ఈ సంస్థకు భూమా మౌనిక వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తుండగా, మంచు మనోజ్‌ సహవ్యవస్థాపకుడు, ఆవిష్కరణల విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.