మూడు గంటల్లోనే హత్య కేసు ఛేదన

- – హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన నిందితులు అరెస్ట్
- – రూ.1.73 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
- – మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకుల పట్టివేత
నిర్మల్/చౌటుప్పల్, నవంబర్ 2 (సేనాని ప్రతినిధి): హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను చౌటుప్పల్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాళ్లబండి సుధాకర్ స్వామిని దారుణంగా హత్య చేసిన దుండగులు, ఆయన ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు, కారును దోచుకుని పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. డయల్ 112కు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల సేకరణ చేపట్టారు. హత్యతో పాటు భారీ మొత్తంలో ఆస్తి దోపిడీ జరగడంతో కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సంఘటనా స్థల పరిసరాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలు, దొంగిలించిన కారు నమోదు సంఖ్య, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. దుండగులు దొంగిలించిన నల్లరంగు టాటా సఫారీ కారులో నాగ్‌పూర్ జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు నిర్ధారించారు. వెంటనే జాతీయ రహదారి 44 మార్గంలోని టోల్ కేంద్రాలను అప్రమత్తం చేయడంతో పాటు సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అన్ని మార్గాల్లో నిఘా పెంచి నిందితులు తప్పించుకోకుండా చర్యలు చేపట్టారు. చౌటుప్పల్ పోలీసుల నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన నిర్మల్ జిల్లా పోలీసులు గంజాల్ టోల్ కేంద్రం వద్ద తనిఖీలు చేపట్టారు. నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 4.05 గంటలకు గంజాల్ టోల్ కేంద్రం వద్ద దొంగిలించిన కారుతో వెళ్తున్న ఇద్దరు నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ (21), హర్ష్ సంతోష్ పాండే (24)గా గుర్తించారు. నేరం జరిగినట్లు సమాచారం అందిన మూడు గంటల్లోపే నిందితులను పట్టుకోవడం ఈ కేసులో పోలీసుల వేగవంతమైన స్పందనకు నిదర్శనంగా నిలిచింది. నిందితుల నుంచి దోపిడీకి గురైన వస్తువులతో పాటు నేరానికి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించి తదుపరి విచారణ చేపట్టారు.
నిందితుల నుంచి మొత్తం రూ.1,73,63,300 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక కిలో 319.33 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండగా, వాటి విలువ సుమారు రూ.1.30 కోట్లుగా అంచనా వేశారు. అలాగే మూడు కిలోల 600.66 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.9,03,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన నల్లరంగు టాటా సఫారీ కారును కూడా పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలుగా పేర్కొన్నారు. ఈ మొత్తం సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించినట్లు గుర్తించిన 23 అంగుళాల కత్తి, నిందితుల మొబైల్ ఫోన్లు, మృతుడికి చెందిన ఐఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో పాటు నిర్మల్ జిల్లా పోలీసుల సమన్వయ కృషిని ప్రశంసించారు. నేరం జరిగిన వెంటనే ఆధారాల సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం ఈ కేసు ఛేదనలో కీలకంగా మారాయని పేర్కొన్నారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. నేరాలకు పాల్పడి తప్పించుకోవచ్చని ఎవరూ భావించరాదని, చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు.