మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

- – మూడు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు
- – పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
- – నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తుహిన్ సిన్హా ఆదేశం
- – విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
అనకాపల్లి, అక్టోబర్ 31 (సేనాని ప్రతినిధి): అనకాపల్లి జిల్లా పరిధిలో నవంబరు 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, పరవాడ, సబ్బవరం ప్రాంతాలకు చెందిన తొమ్మిది వార్డులతో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం నర్సీపట్నం పట్టణ పోలీస్స్టేషన్ మైదానంలో ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించి విధులపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, చేయాల్సిన పనులు, నివారించాల్సిన చర్యలను వివరించారు.
అనంతరం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణతో కలిసి బొడ్డేపల్లిలోని డాన్ బాస్కో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు చట్టంలోని 30వ సెక్షన్, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 163వ సెక్షన్ అమల్లో ఉంటాయని ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లను క్రమబద్ధీకరించి వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఎన్నికల అధికారులు, సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నిబంధనలను అమలు చేయాలన్నారు. అనధికార వ్యక్తులు, రాజకీయ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా చూడాలని, అనుమతి లేని వ్యక్తులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరడం, రాజకీయ చర్చలు నిర్వహించడం వంటి చర్యలను అడ్డుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నపాటి వివాదం తలెత్తినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం లేదా పక్షపాత వైఖరిని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకుల నుంచి వచ్చే ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎ.రవికుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.