మున్సిపల్‌ కౌంటింగ్‌కు మూడంచెల భద్రత!

మున్సిపల్‌ కౌంటింగ్‌కు మూడంచెల భద్రత!
  • – పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ తుహిన్‌ సిన్హా
  • – ఎలమంచిలి, నర్సీపట్నంలో ప్రత్యేక పోలీసు నిఘా
  • – డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
  • – అనుమతి పత్రాలు ఉన్నవారికే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశం

అనకాపల్లి, నవంబర్‌ 2 (సేనాని ప్రతినిధి): అనకాపల్లి జిల్లా పరిధిలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. జిల్లాలోని జీవీఎంసీ తొమ్మిది వార్డులు, అనకాపల్లి, పరవాడ, సబ్బవరం ప్రాంతాలతోపాటు ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్‌ ప్రక్రియ ప్రజలు, అధికారుల సహకారంతో ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. నవంబర్‌ 3న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎలమంచిలిలోని గుర్రప్ప కల్యాణ మండపం కౌంటింగ్‌ కేంద్రం వద్ద పరవాడ డీఎస్పీ బి. మోహనరావు పర్యవేక్షణలో, ఎలమంచిలి సీఐ ఎస్‌. ధనుంజయరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలోని పెద్దబొడ్డేపల్లి డాన్‌ బాస్కో కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, పట్టణ సీఐ షేక్‌ గఫూర్‌ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో నిరంతరం సాయుధ పోలీసు బలగాలు పహారా కాస్తాయని ఎస్పీ వివరించారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉన్నత సామర్థ్యం గల నిఘా కెమెరాలు, డ్రోన్లను వినియోగించనున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు మాత్రమే నిర్దేశిత సమయంలో ప్రవేశం కల్పిస్తారు. అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి చరవాణులు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నిప్పుపెట్టెలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.
కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు అమలు చేయనున్నారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. కేంద్రాల చుట్టుపక్కల నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ప్రజలు గుంపులుగా గుమిగూడటం, అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం, రెచ్చగొట్టే నినాదాలు చేయడం నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓట్ల లెక్కింపు సమయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, ధ్రువీకరించని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. సైబర్‌ నేర విభాగం ద్వారా అలాంటి ప్రచారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని తుహిన్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు.