మురసు తుపానుపై అప్రమత్తం.. ప్రజలకు కలెక్టర్‌ హెచ్చరిక!

మురసు తుపానుపై అప్రమత్తం.. ప్రజలకు కలెక్టర్‌ హెచ్చరిక!
  • – రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలుల అవకాశం
  • – కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
  • – శిథిలావస్థ భవనాలు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లొద్దు
  • – ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం

గుంటూరు, నవంబర్‌ 2 (సేనాని ప్రతినిధి): మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తుపాను పరిస్థితులు, అధికార యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. తుపాను ప్రభావం ఉన్న సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నదులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. వర్షాల సమయంలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున జలవనరుల సమీపంలో సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
పిల్లలను బయటకు పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడల సమీపంలో ప్రజలు ఉండరాదని హెచ్చరించారు. ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు, ప్రమాదకర నిర్మాణాల కింద ఆశ్రయం పొందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను సమయంలో అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సూచించే జాగ్రత్తలను అనుసరించాలని కలెక్టర్‌ తెలిపారు. పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులను చెట్ల కింద కట్టరాదని, సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని కోరారు. వర్షాలు, గాలుల ప్రభావంతో పంటలకు, పశువులకు నష్టం వాటిల్లకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే మండల, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, పోలీసు, కలెక్టరేట్‌ నియంత్రణ కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి పాల్గొన్నారు.