మురసు తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

- – ప్రజల రక్షణ, పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం
- – గ్రామాల్లో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు
- – తాగునీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
- – దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ తక్షణమే పునరుద్ధరించాలి
అమరావతి, నవంబర్ 3 (సేనాని ప్రతినిధి): మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ చర్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను తీరాన్ని దాటే ప్రక్రియ మరికొన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉన్నందున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, రానున్న రెండు మూడు రోజులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయా శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో తుపాను సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, వర్షాలు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై దిశానిర్దేశం చేశారు.
భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ముంపు ప్రమాదం పొంచి ఉందని, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, కాలువ గట్లను ముందుగానే గుర్తించి పటిష్టం చేయాలని ఆదేశించారు. చెరువుల సమీపంలో నివసించే ప్రజలను పరిస్థితులకు అనుగుణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గంటల వ్యవధిలో గుంటూరు వంటి ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడం తుపాను తీవ్రతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.
వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైన చోట ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి ప్రత్యేక కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో తుపాను సమయంలో అనుసరించిన విధానంలోనే పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు సిబ్బందిని వినియోగించాలని ఆదేశించారు. గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మళ్లింపు చర్యలు చేపట్టాలని, మురుగునీటి కాలువల్లో అడ్డంకులు తొలగించాలని తెలిపారు. నీరు తొలగించిన ప్రాంతాల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు నీరు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే నీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, దెబ్బతిన్న పైపులైన్లను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, అవసరమైన చోట అధిక క్లోరినేషన్ చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటి ప్రవాహాల వల్ల దెబ్బతిన్న రహదారులను వర్షాలు తగ్గిన వెంటనే పునరుద్ధరించి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.
పంట, ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాల్లో వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే నష్టం అంచనాలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే శాఖ కమిషనరేట్లో ప్రత్యేక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.