నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి చేర్చిన కేటీఆర్‌!

నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి చేర్చిన కేటీఆర్‌!
  • – మస్కట్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి తుప్పుడు లక్ష్మి
  • – కుమారుడు రాజుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బీఆర్ఎస్‌ నేత
  • – తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు
  • – ఉపాధి పేరుతో మోసపోయి విదేశంలో చిక్కుకున్న మహిళకు విముక్తి

హైదరాబాద్‌, నవంబర్ 3 (సేనాని ప్రతినిధి): ఉపాధి కల్పిస్తామని నమ్మించి విదేశాలకు పంపించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవ చూపారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తల్లి విదేశంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ఆందోళనకు గురైన కుటుంబానికి అండగా నిలిచి, ఆమె తిరిగి స్వదేశానికి చేరుకునేలా అవసరమైన చర్యలు చేపట్టారు. కేటీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరడంతో లక్ష్మి కుటుంబంలో ఆనందం నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, ఆమె భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్‌ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో లక్ష్మి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికితోడు అక్కడి యజమాని ఆమె పాస్‌పోర్టును తన వద్ద ఉంచుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాలకు పంపించిన ఏజెంట్‌ కూడా ఆమె ఫోన్‌కు స్పందించకపోగా, తిరిగి భారత్‌కు పంపించేందుకు రెండు లక్షల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు లక్ష్మి కుటుంబానికి సమాచారం అందించారు.
ఈ క్రమంలో లక్ష్మికి అందుబాటులో ఉన్న వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌, చరవాణి సేవలు నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్‌ సహాయంతో కుమారుడు రాజును సంప్రదించి తన పరిస్థితిని వివరించారు. తల్లి పడుతున్న కష్టాలను తెలుసుకున్న రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే సెప్టెంబర్‌ 29న హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. తన తల్లిని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్‌ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి తల్లిని ఇంటికి తీసుకొస్తానని రాజుకు భరోసా ఇచ్చారు.
కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్‌ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు లక్ష్మిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను స్వయంగా కలిశారు. తన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు ఏజెంట్ల మాటలు నమ్మే ముందు తగిన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
ఈ సందర్భంగా తుప్పుడు లక్ష్మి భావోద్వేగంతో మాట్లాడుతూ, తన కుమారుడికి నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని కేటీఆర్‌ మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం తనను సురక్షితంగా స్వదేశానికి చేర్చారని తెలిపారు. తాను, తన కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచారని, ఆయన చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. తనను తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కృషి చేసిన కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తల్లిని సురక్షితంగా ఇంటికి చేర్చాలన్న కుమారుడి ఆవేదనకు స్పందించి హామీని నెరవేర్చడం ఆ కుటుంబానికి ఊరటనిచ్చింది.