నిర్మాతగా బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ?

నిర్మాతగా బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ?

హైదరాబాద్‌, నవంబరు 13 (సేనాని ప్రతినిధి): నందమూరి కుటుంబం నుంచి మరో వ్యక్తి సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ ప్రవేశంపై గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన నృత్య వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమె నటిగా కాకుండా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
సినిమాలపై ఆసక్తి ఉన్న తేజస్విని ఓ విభిన్నమైన కథతో చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తన సహాధ్యాయి భువన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా అన్వేష్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు సింధూరపువ్వు కృష్ణారెడ్డి కుమారుడైన అన్వేష్‌ ఈ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారట. ప్రముఖ నటుడు బాబీ సింహా కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సినిమా చిత్రీకరణ నవంబరు 23న విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే తేజస్విని నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, దర్శకుడు, నటీనటుల ఎంపిక వంటి అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కథానాయికగా ఎంట్రీ ఇస్తారని భావించిన అభిమానులకు ఆమె నిర్మాతగా మారనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. తేజస్విని తొలి నిర్మాణ ప్రయత్నం ఎలాంటి కథతో ఉండబోతోందో, ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.