నిర్ణీత గడువులోగా గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి చేయాలి

నిర్ణీత గడువులోగా గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి చేయాలి
  • * పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
  • * విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు మెరుగైన వసతులు
  • * రూ.1.53 కోట్లతో నిర్మాణం.. ఇప్పటివరకు రూ.90 లక్షల పనులు పూర్తి
  • * పక్కనే ఉన్న నీటి ట్యాంకును డిసెంబర్‌లోగా అందుబాటులోకి తేవాలి

నారాయణపేట, నవంబర్‌ 12 (సేనాని ప్రతినిధి): నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌. ప్రియాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠకులు, విద్యార్థులు, యువతకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా భవన నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ గదులు, పఠన మందిరం, నిల్వ గది, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠకులు, విద్యార్థులు, యువతకు మెరుగైన గ్రంథాలయ సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి రూ.1.53 కోట్ల నిధులు మంజూరు చేసిందని అధికారులు వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.90 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ సూచించారు. ఇంజనీరింగ్‌ అధికారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులన్నీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. భవనంలో వాస్తు, సౌకర్యవంతమైన నిర్మాణ విధానాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రశాంతంగా కూర్చొని చదువుకునేలా పఠన మందిరాన్ని ఆకర్షణీయమైన రూపకల్పనతో అభివృద్ధి చేయాలని తెలిపారు.
నిల్వ గది, ఇతర గదులు, అంతర్గత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, భవనానికి అవసరమైన అద్దాల అమరిక పనులను ఇంజనీరింగ్‌ ప్రణాళిక ప్రకారం నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. భవనం పై అంతస్తులో చేపట్టాల్సిన పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, గాలి, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెండింగ్‌ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రంథాలయ భవనం పక్కనే నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంకు పనులను కూడా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పనులను డిసెంబర్‌ నెలలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయానికి ఎదురుగా సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఉన్న పాత ఏరియా ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనం పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, దాని ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.