నీటి లభ్యత ఆధారంగా రబీ సాగు ప్రణాళిక రూపొందించాలి: సీఎస్ సంజయ్ జాజ్జు

- – ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి
- – ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధర, రూ.500 బోనస్ అందించాలి
- – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి
- – సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
నారాయణపేట, నవంబర్ 13 (సేనాని ప్రతినిధి): రానున్న రబీ 2026-27 సీజన్లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, విద్య, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించారు. నారాయణపేట కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పాల్గొన్నారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. సూక్ష్మ సేద్యం, రైతు గుర్తింపు కార్డుల నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసి, ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా పర్యవేక్షించాలని సంజయ్ జాజ్జు తెలిపారు. విద్యార్థుల హాజరును 90 శాతానికి పెంచడంతో పాటు డిజిటల్ అభ్యసన వేదికలను సమర్థంగా వినియోగించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. రూసా 2.0, పీఎం ఉషా, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న విద్యా మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో వేరుశనగ, ఆయిల్ పామ్తో పాటు డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్, బత్తాయి, మునగ, మామిడి, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేస్తున్నారని వివరించారు. కొడంగల్ డివిజన్లోని కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి ప్రాంతాల్లో ఆధునిక సాగు పద్ధతులు, మల్చింగ్, నీటి సంరక్షణ విధానాలను రైతులు పాటిస్తున్నారని తెలిపారు. సుమారు 100 మంది ఆదర్శ రైతులను గుర్తించి, వారి పంటల దిగుబడి, లాభాలపై విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు. ఈ వివరాల ఆధారంగా ఇతర రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.