ఓటీటీలో జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ సందడి!

ఓటీటీలో జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ సందడి!

హైదరాబాద్‌, నవంబరు 4 (సేనాని ప్రతినిధి): తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘ఇమ్మోర్టల్‌’ ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. మరియప్పన్‌ చిన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌, కయాదు లోహర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబరు 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్‌లో తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది.
అమ్మాయి అందానికి ఆకర్షితుడైన యువకుడు
మహి (జీవీ ప్రకాశ్‌ కుమార్‌) తన మేనమామకు చెందిన ముద్రణాలయంలో పనిచేస్తుంటాడు. ఇంటి యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంతో మరో గది కోసం వెతుకుతుంటాడు. అదే సమయంలో సింధు (కయాదు లోహర్‌) తన ఫ్లాట్‌లో గది ఖాళీగా ఉందని చెప్పడంతో అక్కడికి మారతాడు. ఖరీదైన ఫ్లాట్‌లో అందమైన అమ్మాయితో కలిసి ఉండే అవకాశం రావడంతో మహి ఆనందపడతాడు.
అయితే సింధు ప్రవర్తన అతడికి అనుమానాలు కలిగిస్తుంది. ఆమె ఎలాంటి పని చేయకపోయినా, వంట చేయకపోయినా కోరుకున్న ఆహారం వెంటనే అందుబాటులోకి వస్తుంటుంది. ఇదిలా ఉండగా, ఆ ఇంట్లో ఓ వృద్ధుడిని చూసిన మహి అతడి గురించి సింధును అడుగుతాడు. అతడు తన తాతయ్య అని, అనారోగ్యంతో ఉన్నాడని ఆమె చెబుతుంది.
రక్తపిశాచి రహస్యం
సింధు లేని సమయంలో ఆ వృద్ధుడు మహికి ఓ షాకింగ్‌ విషయం చెబుతాడు. తాను ఆమె తాతయ్యను కాదని, ఆమెపై మనసు పడిన వైద్యుడినని పరిచయం చేసుకుంటాడు. సింధు సాధారణ మహిళ కాదని, రక్తపిశాచి అని హెచ్చరిస్తాడు. తనకు నచ్చిన రక్త వర్గానికి చెందిన వారిని ఆకర్షించి, వారి రక్తం తాగడమే ఆమె లక్ష్యమని చెబుతూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మహి ఏం చేశాడు? సింధు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అన్నదే మిగతా కథ.
రొమాన్స్‌ నుంచి ఉత్కంఠభరిత మలుపు
సినిమా తొలి భాగం మహి, సింధు పరిచయం, వారి మధ్య పెరిగే సాన్నిహిత్యం చుట్టూ సాగుతుంది. సింధు అందానికి ఆకర్షితుడైన మహి ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. దీంతో మొదట్లో కథనం రొమాంటిక్‌ ధోరణిలో ఉంటుంది. విరామం తర్వాత సింధు అసలు స్వరూపం గురించి తెలిసే కొద్దీ కథ హారర్‌ థ్రిల్లర్‌గా మారుతుంది. ఆ ఇంటి నుంచి బయటపడేందుకు మహి చేసే ప్రయత్నాలు ఉత్కంఠను కలిగిస్తాయి.
ఈ చిత్రంలో పరిమిత సంఖ్యలో పాత్రలే కనిపిస్తాయి. కయాదు లోహర్‌ తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకున్నారు. అరుణ్‌ రాధాకృష్ణన్‌ ఛాయాగ్రహణం, సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం భయానక వాతావరణాన్ని మరింత బలంగా చూపించాయి. రాజేశ్‌ ఎడిటింగ్‌ కథనం వేగంగా సాగేందుకు తోడ్పడింది. పరిమిత ప్రదేశంలో, కొద్దిమంది పాత్రలతో సాగే భిన్నమైన హారర్‌ కథలను ఇష్టపడేవారు ‘ఇమ్మోర్టల్‌’ను పరిశీలించవచ్చు.