పాదయాత్రలో రోడ్డు ప్రమాదంపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

పాదయాత్రలో రోడ్డు ప్రమాదంపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
  • – డీజీపీని కలిసి సమగ్ర దర్యాప్తు కోరిన ఎమ్మెల్సీ
  • – లారీ ఢీకొట్టిన ఘటనపై అనుమానాలు వ్యక్తం
  • – ఉద్దేశపూర్వక దాడి కోణంలోనూ విచారణ జరపాలని విజ్ఞప్తి
  • – సీసీటీవీ, ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలని కోరిన నేత

హైదరాబాద్, నవంబర్ 13 (సేనాని ప్రతినిధి): బీసీ రాజ్యాధికార పాదయాత్రలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అన్నాజీపురం–తిరుమలగిరి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని, దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. తనతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేశారు.
వలిగొండ నుంచి తొర్రూరు జాతీయ రహదారి వైపు పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ తన వాహనంతో పాటు మరో కారును బలంగా ఢీకొట్టిందని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తన సిబ్బందితో పాటు మరో వాహనంలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు, పరిస్థితులు అనుమానాలకు తావిస్తున్నాయని, తన రాజకీయ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న కొందరు వ్యక్తులు బీసీల రాజకీయ సాధికారత కోసం చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనకు హాని కలిగించాలనే కుట్ర జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరపాలని కోరారు.
ఈ ఘటనపై తక్షణమే తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ స్థాయికి తగ్గకుండా సీనియర్ పోలీసు అధికారికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమాని, డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య సమాచారం, డ్రైవర్ ఉద్యోగ సంబంధాలు, గతంలో ఆ వాహనం ప్రయాణించిన మార్గాలపై విచారణ జరపాలని సూచించారు. తనను లక్ష్యంగా చేసుకునేందుకు ఎవరైనా లారీని లేదా డ్రైవర్‌ను ఉపయోగించారా అనే విషయాన్ని నిర్ధారించాలని కోరారు. ప్రమాద ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలు, జాతీయ రహదారి నిఘా కెమెరాల రికార్డులు, సమీపంలోని వ్యాపార సంస్థలు, భవనాల్లోని కెమెరాల దృశ్యాలు, మొబైల్ ఫోన్ వీడియోలు, కాల్ రికార్డులు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను వెంటనే భద్రపరచాలని తీన్మార్ మల్లన్న కోరారు. ముందస్తుగా తనపై నిఘా పెట్టారా, రాజకీయ శత్రుత్వం కారణంగా ఈ ఘటన జరిగిందా, పాదయాత్రను అడ్డుకోవడానికి లేదా అందులో పాల్గొంటున్న వారికి హాని కలిగించడానికి ఎవరైనా ప్రయత్నించారా అనే అంశాలను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీలకు రాజకీయ, సామాజిక, రాజ్యాంగబద్ధమైన హక్కులు, తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రజాస్వామ్య లక్ష్యంతోనే పాదయాత్ర చేపట్టినట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటున్న వారిని బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం లేదా శారీరకంగా హాని కలిగించే ప్రయత్నాలు చేయడం తీవ్రమైన విషయమన్నారు. చట్టంపై, తెలంగాణ పోలీసుల నిష్పక్షపాత పనితీరుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, డీజీపీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఆధారాలు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీకుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.