పలాస అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పలాస అభివృద్ధికి సంపూర్ణ సహకారం
  • – చారిత్రాత్మక విజయంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం
  • – చైర్‌పర్సన్‌ వజ్జ గంగా భవానికి మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
  • – 31 మంది కూటమి కౌన్సిలర్లకు శుభాకాంక్షలు
  • – ఆదర్శ పట్టణంగా పలాస–కాశీబుగ్గ తీర్చిదిద్దడమే లక్ష్యం

పలాస, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించడం ప్రజలు తమపై ఉంచిన అపారమైన విశ్వాసానికి నిదర్శనమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అంకితభావం, నిరంతర శ్రమ ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వజ్జ గంగా భవానితో పాటు విజయం సాధించిన 31 మంది కూటమి కౌన్సిలర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నిమ్మాడలోని తన శిబిర కార్యాలయంలో వారిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన వెన్నెముక అని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ జెండాను భుజాన మోస్తూ ప్రజల్లో ఉంటూ పనిచేసిన ప్రతి కార్యకర్త కష్టానికి ఈ విజయం తగిన ప్రతిఫలమని పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పించడం తమ సంప్రదాయమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు చూపిన పట్టుదల, సమష్టి కృషి ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచాయని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నూతన ప్రజాప్రతినిధులు పెద్ద బాధ్యతగా భావించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. పదవులు బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఎన్నికల విజయానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. కూటమి నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతూ పట్టణ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పలాస–కాశీబుగ్గ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారులు, మురుగునీటి కాలువల వ్యవస్థతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. పలాస పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో లభించిన ప్రజా మద్దతును అభివృద్ధి పనుల ద్వారా నిలబెట్టుకోవాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని విజయం సాధించిన కౌన్సిలర్లకు సూచించారు. పలాస–కాశీబుగ్గను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.