పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ!

పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ!

వెల్లింగ్టన్‌, నవంబరు 7 (సేనాని ప్రతినిధి): భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
రెండో బంతికే రికార్డు
ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ, పాంటింగ్‌ ఇద్దరూ న్యూజిలాండ్‌పై చెరో 1,971 పరుగులతో సమంగా ఉన్నారు. 135 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కోహ్లీ.. తాను ఎదుర్కొన్న రెండో బంతికే బౌండరీ బాది పాంటింగ్‌ను వెనక్కి నెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాకబ్‌ డఫ్ఫీ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే రికార్డు మాత్రం అతడి సొంతమైంది. ప్రస్తుతం కివీస్‌పై కోహ్లీ పరుగుల సంఖ్య 1,978కి చేరింది.
38 ఇన్నింగ్స్‌ల్లోనే ఘనత
రికీ పాంటింగ్‌ న్యూజిలాండ్‌పై 51 మ్యాచ్‌ల్లో 50 ఇన్నింగ్స్‌లు ఆడి 1,971 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 12 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీ మాత్రం కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును అధిగమించడం విశేషం. ఈ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో న్యూజిలాండ్‌పై వన్డేల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచే అవకాశం అతడికి ఉంది.
టాప్‌-5లో కోహ్లీదే అగ్రస్థానం
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 1,978 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌ 1,971 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 1,750 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, కుమార్‌ సంగక్కర 1,568, సనత్‌ జయసూర్య 1,519 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇదే సిరీస్‌లోని తొలి వన్డేలోనూ కోహ్లీ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇలా వరుస మ్యాచ్‌ల్లో రికార్డులు సాధిస్తూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.