పాత చెక్‌బుక్‌లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

పాత చెక్‌బుక్‌లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

హైదరాబాద్‌, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): పాత బ్యాంకు చెక్‌బుక్‌ల వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి పాత చెక్‌బుక్‌లను నిలిపివేసి, కొత్త వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. రూ.50 వేలకుపైగా మొత్తానికి పాత చెక్కులను బ్యాంకులు అంగీకరించవన్న వాదనలోనూ నిజం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఇలాంటి నిబంధన ఏదీ అమల్లో లేదని స్పష్టం చేసింది.
వైరల్‌ సందేశంలో ఏముంది?
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం ప్రకారం.. పాత చెక్‌బుక్‌లను 2026 డిసెంబరు 31లోగా మార్చుకోవాలి. 2027 జనవరి 1 నుంచి కొత్త చెక్‌బుక్‌లను మాత్రమే ఉపయోగించాలి. కొత్త చెక్‌బుక్‌లలో ప్రత్యేక అక్షర, సంఖ్యా సంకేతాలు, కొత్త ఎంఐసీఆర్‌ నంబరు, అతినీలలోహిత భద్రతా సంకేతాలు వంటి మార్పులు ఉంటాయని ఆ సందేశంలో పేర్కొన్నారు. రూ.50 వేలకుపైగా మొత్తానికి పాత చెక్కులు చెల్లవని కూడా ప్రచారం చేశారు. కొత్త చెక్‌బుక్‌ల కోసం బ్యాంకు శాఖలో లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వైరల్‌ ప్రచారాన్ని ఖండించిన ఆర్‌బీఐ
ఈ వాదనలను ఆర్‌బీఐ పూర్తిగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సమాచారం నకిలీదని తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. పాత చెక్‌బుక్‌లను రద్దు చేయడం, కొత్త వాటిని తప్పనిసరి చేయడం లేదా రూ.50 వేల పరిమితిని విధించడం వంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని స్పష్టం చేసింది.
అధికారిక సమాచారాన్నే నమ్మాలి
సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినంత మాత్రాన అది నిజమని నమ్మకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. బ్యాంకింగ్‌ నిబంధనలకు సంబంధించి ఏదైనా సమాచారం అందితే ముందుగా సంబంధిత బ్యాంకు లేదా ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ధృవీకరించని సందేశాలను ఇతరులకు పంపకుండా ఉండటం ద్వారా తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.