పాత కరెంటుకూ ఇప్పుడు అదనపు బిల్లు!

పాత కరెంటుకూ ఇప్పుడు అదనపు బిల్లు!

హైదరాబాద్‌, నవంబరు 6 (సేనాని ప్రతినిధి): గతంలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన అదనపు ఛార్జీలను ఇప్పుడు వసూలు చేస్తుండటంతో తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులపై భారం పెరుగుతోంది. నవంబరు నెల నుంచి విద్యుత్‌ బిల్లుల్లో ఈ ట్రూ అప్‌ ఛార్జీలను డిస్కంలు కలిపాయి. ఇప్పటికే పెరిగిన విద్యుత్‌ వినియోగంతో అధిక బిల్లులు వస్తుండగా, అదనపు ఛార్జీలు తోడవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్ల క్రితం విద్యుత్‌ కొనుగోళ్లకు అదనపు భారం
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయేతర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అయిన అదనపు ఖర్చును వినియోగదారుల నుంచి రాబట్టేందుకు ఈ ఛార్జీలు విధిస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.4,222.93 కోట్ల వసూళ్లకు విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ పరిధి వాటా సుమారు 60 శాతంగా ఉంది. దీంతో నగర వినియోగదారులపై దాదాపు రూ.2,533 కోట్ల భారం పడనుంది.
29 నెలల పాటు వసూళ్లు
ఈ అదనపు ఛార్జీలను ఒకేసారి కాకుండా 29 నెలల పాటు వసూలు చేయనున్నారు. ఈ నెల నుంచి ప్రతి యూనిట్‌కు 30 పైసల చొప్పున ట్రూ అప్‌ ఛార్జీలు విధిస్తున్నారు. డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతి నెలా సగటున రూ.87 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి ఒక్కో ఇంటికి అదనపు భారం మారనుంది.
అద్దెదారులు, అపార్ట్‌మెంట్‌ వాసులకు ఇబ్బందులు
ట్రూ అప్‌ ఛార్జీల ప్రభావం పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలపై కూడా పడుతోంది. గచ్చిబౌలిలోని మైంహోం విహంగ వంటి భారీ నివాస సముదాయానికి ఈ నెలలోనే ట్రూ అప్‌ రూపంలో రూ.2.39 లక్షల బిల్లు వచ్చినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. లక్షల్లో అదనపు బిల్లులు రావడంతో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, అద్దె ఇళ్లలో నివసించేవారికి ఈ వసూళ్లు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. 2022-23లో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన అదనపు మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తుండటంతో, అప్పట్లో ఆ ఇంట్లో ఉన్నవారికి బదులుగా ప్రస్తుతం ఉంటున్న అద్దెదారులే చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఇళ్ల యజమానులు, అద్దెదారుల మధ్య బిల్లుల చెల్లింపుపై వివాదాలు తలెత్తుతున్నాయి. పాత వినియోగానికి సంబంధించిన బకాయిలను ఎవరు చెల్లించాలన్నది స్పష్టంగా తేలకపోవడంతో అద్దెదారులు ఇబ్బందులు పడుతున్నారు.