పటాన్చెరు పారిశుధ్యానికి ఆధునిక వాహనాలు!

- – రూ.12 కోట్లతో 10 స్వీపింగ్ యంత్రాలు, 10 టిప్పర్లు
- – తోషిబా సంస్థ సామాజిక బాధ్యత నిధులతో కొనుగోలు
- – తొలి విడతలో 5 టిప్పర్లు, 5 స్వీపింగ్ యంత్రాలు ప్రారంభం
- – పారిశుధ్య సిబ్బందిని పెంచాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే జీఎంఆర్ విజ్ఞప్తి
పటాన్చెరు, నవంబర్ 2 (సేనాని ప్రతినిధి): పటాన్చెరు నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవతో తోషిబా పరిశ్రమ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.12 కోట్ల వ్యయంతో 10 స్వీపింగ్ యంత్రాలు, 10 టిప్పర్లను కొనుగోలు చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్లలో పెరుగుతున్న జనాభా, నూతన కాలనీలకు అనుగుణంగా పారిశుధ్య సేవలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం ఉదయం పటాన్చెరు డివిజన్లోని మైత్రి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్, తోషిబా పరిశ్రమ ప్రతినిధి మారుమోటో కలిసి తొలి విడతలో అందుబాటులోకి తెచ్చిన ఐదు టిప్పర్లు, ఐదు స్వీపింగ్ యంత్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిందని, వందల సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పారిశుధ్య సేవలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్లలో ఉన్న తొమ్మిది డివిజన్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక వాహనాలను కొనుగోలు చేసినట్లు వివరించారు.
తోషిబా సంస్థ అందించిన రూ.12 కోట్ల సామాజిక బాధ్యత నిధులతో మొత్తం 10 స్వీపింగ్ యంత్రాలు, 10 టిప్పర్లను సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొలి విడతలో అమీన్పూర్ సర్కిల్‌కు మూడు స్వీపింగ్ యంత్రాలు, మూడు టిప్పర్లు, పటాన్చెరు సర్కిల్‌కు రెండు స్వీపింగ్ యంత్రాలు, రెండు టిప్పర్లను కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన వాహనాలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు జాతీయ రహదారిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా మరో స్వీపింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వాహనాలు రహదారులు, కాలనీల పరిశుభ్రతకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పారిశుధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తొమ్మిది డివిజన్ల పరిధిలో కాలనీలు పెరుగుతున్నప్పటికీ అందుకు తగినంత మంది పారిశుధ్య కార్మికులు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న కార్మికులు మరణించిన సందర్భాల్లో వారి స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని తెలిపారు. ప్రతి డివిజన్లో అవసరమైన మేరకు పారిశుధ్య సిబ్బందిని తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. పారిశుధ్య వాహనాలతోపాటు జేసీబీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో తమ సంస్థను భాగస్వామిగా చేసినందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తోషిబా పరిశ్రమ ప్రతినిధి మారుమోటో పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంస్థ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ కోసం సామాజిక బాధ్యత నిధులతో వాహనాలు సమకూర్చడం అభినందనీయమని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ అన్నారు. ఆధునిక వాహనాల వినియోగంతో పారిశుధ్య పనులు వేగవంతం కావడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.