ప్రపంచ పెట్టుబడుల వేదికగా తెలంగాణ

* పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి సమీక్ష
* ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులకు ఆహ్వానాలు
* దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ప్రదర్శనల్లో ఒకటిగా సదస్సు
* ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణకు గుర్తింపు లక్ష్యం
హైదరాబాద్, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించిన ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ స్థాయి వ్యక్తుల నుంచి అందిన స్పందన, వారి రాకకు సంబంధించిన నిర్ధారణలపై అధికారులతో చర్చించారు. సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
రానున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ప్రదర్శనల్లో ఒకటిగా నిలవనుందని సంజయ్ జాజు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, పెట్టుబడిదారులకు ఒకే వేదికపై తమ అవకాశాలను పరిచయం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలు, మౌలిక వసతులు, వివిధ రంగాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు సదస్సును ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, జాతీయ స్థాయి ప్రముఖుల భాగస్వామ్యంతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం సదస్సు ప్రధాన ఉద్దేశమని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్య రంగాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను సమగ్రంగా వివరించేందుకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సదస్సు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.bతెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ సదస్సును ఒక ముఖ్యమైన వేదికగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొత్త అవకాశాలు సృష్టించాలని యోచిస్తోంది. సదస్సుకు ఆహ్వానితుల హాజరు నిర్ధారణ, ఏర్పాట్ల పురోగతిపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సంజయ్ జాజు సూచించారు.