రామ్‌చరణ్ సినిమాలో నటించడం లేదు: రిషికాంత్

హైదరాబాద్, నవంబరు 10 (సేనాని ప్రతినిధి): మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తమిళ నటుడు రిషికాంత్ తెరదించారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో లేదా ప్రతినాయకుడిగా నటిస్తున్నారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినిమా పూజా కార్యక్రమానికి ఆయన హాజరుకావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
తాజాగా ఈ ప్రచారంపై స్పందించిన రిషికాంత్.. తాను ఈ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తాను కథానాయకుడిగా ‘మొద రాత్రి’ అనే సినిమా చేశానని తెలిపారు. ఆ సంస్థతో ఉన్న పరిచయం, సన్నిహిత సంబంధాల కారణంగానే రామ్‌చరణ్ సినిమా పూజా కార్యక్రమానికి తనను ఆహ్వానించారని వెల్లడించారు.
పూజా కార్యక్రమానికి తాను వెళ్లడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయని రిషికాంత్ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత తాను అందులో లేనని తెలిసి ప్రేక్షకులు నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. దీంతో రామ్‌చరణ్ సినిమాలో రిషికాంత్ నటిస్తున్నారనే ప్రచారానికి తెరపడింది.