రెండు డివిజన్లకు వైకాపా అభ్యర్థుల ప్రకటన

రెండు డివిజన్లకు వైకాపా అభ్యర్థుల ప్రకటన

* 46వ డివిజన్‌ నుంచి కళ్లి కృష్ణవేణి పోటీ
* 47వ డివిజన్‌ అభ్యర్థిగా తిరగటి సరస్వతి
* మిగిలిన డివిజన్ల అభ్యర్థులపై త్వరలో నిర్ణయం
* రాజమహేంద్రవరం అభివృద్ధిపై మార్గాని భరత్‌ విమర్శలు

రాజమహేంద్రవరం, నవంబర్‌ 10 (సేనాని ప్రతినిధి): త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు డివిజన్ల అభ్యర్థులను మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నగర నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్‌ రామ్‌ ప్రకటించారు. పాత 46వ డివిజన్‌ (కొత్త 66వ డివిజన్‌) నుంచి కళ్లి మురళి సతీమణి కళ్లి కృష్ణవేణి, పాత 47వ డివిజన్‌ (కొత్త 68వ డివిజన్‌) నుంచి తిరగటి దుర్గ సతీమణి తిరగటి సరస్వతి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మంగళవారం స్థానిక క్వారీ మార్కెట్‌ కూడలిలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం వ్యక్తం చేశాయి. మిగిలిన పాత 45, 48, 49 డివిజన్ల అభ్యర్థులను నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఎంపిక చేస్తామని భరత్‌ రామ్‌ తెలిపారు. 47వ డివిజన్‌ అభ్యర్థి తిరగటి సరస్వతిని గెలిపించే బాధ్యతను మాజీ కార్పొరేటర్‌ చోడిశెట్టి సత్యవాణి తీసుకుంటారని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని భరత్‌ రామ్‌ విమర్శించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో క్వారీ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు పార్లమెంటు నమూనాను ఏర్పాటు చేశామని, గ్లో గార్డెన్‌ నిర్మాణం, క్వారీ రహదారి విస్తరణ చేపట్టామని గుర్తుచేశారు. మోరంపూడి పైవంతెన నిర్మాణానికి నిధులు తీసుకొచ్చామని, అయితే ప్రస్తుతం సర్వీసు రహదారులు, ఇతర పనులు పూర్తికాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నగరంలోని రహదారులను తవ్వి వదిలేయడం వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, పనులు పూర్తయిన వెంటనే రహదారులను పునరుద్ధరించాలని సూచించారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని భరత్‌ రామ్‌ తెలిపారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులకు స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈవీఎం ఎమ్మెల్యే అంటూ స్థానిక ప్రజాప్రతినిధిపై విమర్శలు చేసిన ఆయన, నగర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తమ పార్టీ నిలదీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మార్గాని నాగేశ్వరరావు, నక్కా శ్రీనగేష్‌, పోలు విజయలక్ష్మి, అజ్జరపు వాసు, దాసి వెంకటరావు, మార్తి లక్ష్మి, పతివాడ రమేష్‌బాబు, గుడాల ప్రసాద్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.