రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారుల పట్టివేత

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారుల పట్టివేత
  • ఏసీబీ వలకు చిక్కిన క్రీడల అధికారి, టైపిస్ట్
  • – పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి లంచం డిమాండ్‌
  • – రూ.3.10 లక్షల చెక్కు విడుదల కోసం వసూలు
  • – నిందితులను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అధికారులు

మహబూబ్‌నగర్, నవంబర్ 5 (సేనాని ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని ఇద్దరు ఉద్యోగులను పట్టుకున్నారు. జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కుల రాజశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టు టైపిస్ట్ గోరె ఉమేష్‌ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్పోర్ట్స్‌ హాస్టల్‌కు ఆహార సరఫరా చేసిన కేటరింగ్‌ సంస్థకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
స్పోర్ట్స్‌ హాస్టల్‌కు ఆహార సరఫరా చేసిన కేటరింగ్‌ నిర్వాహకుడి బిల్లులు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిశీలించి ఆమోదించడంతో పాటు చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసేందుకు నిందితులు లంచం అడిగినట్లు ఏసీబీ తెలిపింది. రూ.3.10 లక్షల విలువైన చెక్కును విడుదల చేయించేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో రూ.లక్ష నగదు తీసుకుంటుండగా జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కుల రాజశేఖర్‌రెడ్డితో పాటు కాంట్రాక్టు టైపిస్ట్ గోరె ఉమేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును రాజశేఖర్‌రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో బిల్లుల ఆమోదం, చెక్కు విడుదల ప్రక్రియలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్‌ చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. అవినీతికి సంబంధించిన సమాచారం ఉంటే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫోన్‌ చేసి తెలియజేయాలని కోరారు. ఫిర్యాదుదారుల సహకారంతో అవినీతి నిరోధక చర్యలను మరింత సమర్థంగా కొనసాగిస్తామని తెలిపారు.