షబ్బీర్ అలీపై ఏడాది సస్పెన్షన్

హైదరాబాద్, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీపై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అబ్బాస్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడి హోదాలో ఆయన అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సంఘం కార్యవర్గ, సాంకేతిక, సాధారణ మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జీ. ఫాల్గుణ వెల్లడించారు.
సంతోష్ ట్రోఫీ కోసం తెలంగాణ జట్టుకు కోచ్‌గా షబ్బీర్ అలీని నియమించారు. ఆ సమయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మార్గదర్శకాల ప్రకారం తన వద్ద ఏఎఫ్‌సీ బీ లైసెన్స్ ధ్రువపత్రం ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం తెలిపింది. ఆ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే కోచ్‌గా నియమించినట్లు వివరించింది. అయితే బెంగళూరులో సంతోష్ ట్రోఫీ పోటీలు జరుగుతున్న సమయంలో షబ్బీర్ అలీని కోచ్‌గా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అంగీకరించలేదు. ఆయన వద్ద ఏఎఫ్‌సీ బీ లైసెన్స్ ధ్రువపత్రం లేదని ఆ సమయంలో గుర్తించినట్లు ఫాల్గుణ తెలిపారు.
ఈ వ్యవహారంతో పాటు క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని షబ్బీర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు సంఘం వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా పలు క్రీడా సమావేశాలకు హాజరైనట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయని తెలిపింది.