శాస్త్రీయ కులగణన కోసం నవంబర్‌ 28న ఢిల్లీలో నిరసనలు

శాస్త్రీయ కులగణన కోసం నవంబర్‌ 28న ఢిల్లీలో నిరసనలు
  • – రామ్‌లీలా మైదాన్‌లో ‘చలో రామ్‌లీలా మైదాన్‌’ కార్యక్రమం
  • – ప్రతి కులానికి ప్రత్యేక కోడ్‌ కేటాయించాలని డిమాండ్‌
  • – జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలి
  • – ఓబీసీ, బీసీ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్‌ 12 (సేనాని ప్రతినిధి): 2027లో నిర్వహించనున్న కులగణనను సమగ్రంగా, శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో దేశవ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో ఆల్‌ ఇండియా కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ‘చలో రామ్‌లీలా మైదాన్‌’ పేరుతో నిర్వహించే ఈ నిరసనలో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ సంఘాలు, ఉద్యమకారులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
2027 కులగణనలో దేశంలోని అన్ని కులాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, జనరల్‌ కేటగిరీతో సహా అన్ని వర్గాల కులాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రాప్‌డౌన్‌ ఎంపికలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కులానికి ప్రత్యేకమైన, ప్రామాణికమైన కోడ్‌ కేటాయించాలని కోరారు. ఈ విధానం ద్వారా కులాల వారీగా కచ్చితమైన గణాంకాలను సేకరించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఓబీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ, సరైన కులగణన గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో జనాభా నిష్పత్తికి అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే కచ్చితమైన, శాస్త్రీయమైన గణాంకాలు అవసరమని తెలిపారు. కులాల వారీగా జనాభా వివరాలు స్పష్టంగా ఉంటేనే వివిధ రంగాల్లో ప్రాతినిధ్యంపై సమగ్రంగా చర్చించేందుకు వీలవుతుందని వివరించారు. 2027లో చేపట్టనున్న కులగణన దేశంలోని అన్ని కులాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు లభించిన చారిత్రాత్మక అవకాశమని శ్రీనివాస్‌ గౌడ్‌ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కుల కోడ్లతో కూడిన సమగ్ర కులగణన చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా, ప్రతి కులానికి సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేసేలా విధానాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు.
నవంబర్‌ 28న రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఓబీసీ, బీసీ సంఘాలు, సామాజిక న్యాయ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది పి. విల్సన్‌, రాజకీయ విశ్లేషకుడు, భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌, పార్టీ ఫర్‌ ది రైట్స్‌ ఆఫ్‌ ఓబీసీస్‌, ఎస్‌ఎఫ్‌ఆర్‌బీసీ అధ్యక్షుడు వి. రత్నసబాపతి, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు డా. జి. కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.