సాయి పల్లవి చేతిలో రుద్రాక్ష.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

హైదరాబాద్, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): దక్షిణాది చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న గుర్తింపు, అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ, పాత్రల ఎంపికలో తనదైన బాటలో సాగుతున్న ఈ కథానాయిక కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతోనూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమెకు ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోయినా, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రతో దేశవ్యాప్తంగా చర్చలో నిలుస్తోంది.
సినిమాల విషయాన్ని పక్కన పెడితే సాయి పల్లవి జీవనశైలి కూడా ఇతర తారలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. స్టార్ కథానాయిక అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా కనిపిస్తుంది. ఆమెకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేతికి ఓ రుద్రాక్ష మాల కనిపిస్తూనే ఉంటుంది. తెరపైనైనా, తెరవెనుకైనా ఆ మాల ఆమె చేతిలో ఉండటం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇటీవల ‘రామాయణ’ ప్రచార కార్యక్రమాల్లోనూ రుద్రాక్ష మాలతో కనిపించడంతో దాని వెనుక ఉన్న కారణం ఏమిటన్న ఆసక్తి మొదలైంది.
తన చేతికి ఉండే రుద్రాక్ష మాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి స్వయంగా వివరించింది. తన తాతయ్య ఇచ్చిన ఆ మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తానని తెలిపింది. అది తనకు కేవలం ఆభరణం మాత్రమే కాదని, తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే విలువైన జ్ఞాపకమని చెప్పింది. జీవితంలో కొన్ని వస్తువులకు భావోద్వేగపరమైన విలువ ఉంటుందని, తనకు ఈ రుద్రాక్ష మాల అలాంటిదేనని వివరించింది.
ఆ మాలను ధరించిన తర్వాత తనలో ప్రార్థన చేయాలనే ఆసక్తి పెరిగిందని సాయి పల్లవి వెల్లడించింది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేస్తానని, ఆ సమయంలోనూ రుద్రాక్ష తనకు తోడ్పడుతుందని తెలిపింది. ఆ మాల దగ్గర ఉన్నప్పుడు ఆలోచనలు అదుపులో ఉంటాయని, అతిగా ఆలోచించే స్వభావం తగ్గుతుందని చెప్పుకొచ్చింది. అందుకే తాతయ్య ఇచ్చిన ఆ రుద్రాక్ష మాలను ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటానని సాయి పల్లవి వివరించింది.