సెలక్టర్ల తీరుపై సర్ఫరాజ్‌ అసంతృప్తి

సెలక్టర్ల తీరుపై సర్ఫరాజ్‌ అసంతృప్తి

ముంబై, నవంబరు 3 (సేనాని ప్రతినిధి): టీమిండియా టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కకపోవడంపై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆవేదన చెందాడు. మంచి ప్రదర్శన చేసినా సెలక్టర్లు గుర్తించకపోతే తాను ఎవరి కోసం కష్టపడాలని ప్రశ్నించాడు. తన తండ్రి కోసమే క్రికెట్‌లో కొనసాగుతున్నానని, ఆయన లేకపోతే ఆటను ఎప్పుడో వదిలేసేవాడినని వ్యాఖ్యానించాడు.
22 కిలోల బరువు తగ్గినా విమర్శలు
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్‌.. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో రాణించాడు. ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్‌ తన ఫిట్‌నెస్‌ ప్రయాణం గురించి వివరించాడు.
గతంలో అధిక బరువు కారణంగా పలువురు తనను హేళన చేశారని, దాంతో ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి 22 కిలోల బరువు తగ్గానని తెలిపాడు. అయితే ఇప్పుడు తాను బరువు తగ్గిన తర్వాత కూడా గతంలోనే బాగా ఆడేవాడినంటూ కొందరు విమర్శిస్తున్నారని చెప్పాడు. ఇలాంటి వ్యాఖ్యలను తాను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశాడు.
తండ్రి కోసమే క్రికెట్‌ కొనసాగిస్తున్నా
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తాను ఎందుకు శ్రమించాలి? ఎవరి కోసం కష్టపడాలి? తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేచి సాధన ఎందుకు చేయాలి? అని తనను తాను ప్రశ్నించుకుంటానని సర్ఫరాజ్‌ చెప్పాడు. ఇప్పటికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశాడు. అయినప్పటికీ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి శ్రమిస్తున్నానని తెలిపాడు.
తన తండ్రి కోసమే క్రికెట్‌లో కొనసాగుతున్నానని సర్ఫరాజ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దేశవాళీ క్రికెట్‌లో అతడి ప్రదర్శన, ఫిట్‌నెస్‌ మెరుగుదల నేపథ్యంలో రానున్న రోజుల్లో సెలక్టర్లు అతడికి మరోసారి అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.