– వాట్సాప్ లోన్ ఆఫర్‌తో లక్షల మోసం
– సెలబ్రిటీ డీపీతో నమ్మబలికిన కేటుగాళ్లు
– ముందస్తు ఫీజుల పేరుతో డబ్బు దోపిడీ
– సైబర్ పోలీసులు అప్రమత్తం చేసిన హెచ్చరిక
14 Oct 2025 (senani.net): హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ నేరగాళ్లు తమ మోసపూరిత ఆటతీరుతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారు. బేగంపేటకు చెందిన 30ఏళ్ల వ్యక్తికి లోన్ ఇస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు లక్షల్లో డబ్బు పీకేశారు. ప్రభుత్వ యంత్రాంగం వరుసగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఈ తరహా కేసులు ఆగడం లేదు. ప్రతి కొత్త పద్ధతితో సైబర్ మోసగాళ్లు అమాయకులను వలలోకి దిస్తున్నారు. ఫౌండర్ సల్మాన్ ఖాన్ పేరుతో వాట్సాప్‌లో ప్రొఫైల్ పెట్టుకుని, రూ.50 లక్షల లోన్ ఇస్తామని ఒక వ్యక్తి బాధితుడిని సంప్రదించాడు. రుణ ప్రక్రియ కోసం ముందుగా రూ.10 లక్షలు ఫీజులు, టాక్స్ పేరిట చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. దానికి నమ్మకం వచ్చిన బాధితుడు దశలవారీగా మొత్తం రూ.7.9 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కాంటాక్ట్ నిలిపేయడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పూర్తి వివరాలు వెల్లడిరచింది. ఫేక్ ఎన్జీవోలు, తెలియని వ్యక్తుల ప్రలోభాలకు లోనవ్వొద్దని స్పష్టంగా హెచ్చరించింది. ముఖ్యంగా సెలబ్రిటీ డీపీలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్‌లు పెట్టి చేసే కాల్స్‌ను ప్రజలు విశ్వసించవద్దని సూచించింది. అసలు లోన్ ప్రక్రియలో ముందస్తు డబ్బు చెల్లింపు అధికారికంగా ఉండదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు మానసిక ఒత్తిడి, తక్షణ సహాయం అనే మోసపూరిత భావనను కలిగించి తక్షణ నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని అధికారుల హెచ్చరిక. ధృవీకరించిన బ్యాంకులు, నమోదు చేసిన ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల ద్వారానే లోన్ కోరాలని సూచించారు. ఫేక్ ఎన్జీవో పేర్లు, పెద్ద పెద్ద హామీలతో చేసే కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే స్పందించాలి. డయల్ 1930 లేదా ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారుల పిలుపు. ఆలస్యమైతే డబ్బు ట్రేస్ చేసే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే ఈ తరహా మోసాలకు చెక్ పడుతుందని పోలీసులు స్పష్టం చేశారు.



