– నడిరోడ్డుపై మాస్క్ ధరించిన దుండగుడి దాడి
– కత్తితో బుజ్జి అనే వ్యక్తిపై తీవ్రంగా దాడి
– సంఘటనా స్థలంలోనే మృతిబీ పోలీసుల విచారణ ప్రారంభం
14 Oct 2025 (senani.net): గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో మంగళవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. అమర్తులూరు మండలం కోడితాడిపర్రుకు చెందిన బుజ్జి అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, స్కూటీపై ముఖానికి మాస్క్ వేసుకున్న దుండగుడు వచ్చి అతనిపై కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరావడం లేదని, నిందితుడిని పట్టుకున్న తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మాస్క్ ధరించి మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగుడు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా పారిపోవడంతో, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. తెనాలి పట్టణంలో అప్రమత్తత పెంచి, ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఓ సాధారణ ఉదయం ఈ విధంగా హత్య జరిగి ఉద్రిక్తత నెలకొనడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, దుండగుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు నమ్మకం వ్యక్తం చేశారు.



