– తుమ్మల నాగేశ్వరరావు మానవత్వం మరిచారా? : శ్రీనివాస్ గౌడ్ మండిపాటు’’
14 Oct 2025 (senani.net): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ నాయకులు – కాంగ్రెస్ మంత్రుల మధ్య మాటల దాడులు తీవ్రమవుతున్నాయి. మాగంటి సునీత భావోద్వేగానికి లోనైన విషయంపై కాంగ్రెస్ నుంచి వస్తున్న వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిరచింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధాటిగా స్పందిస్తూ తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాగంటి సునీత తన భర్తను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం సహజమైతే, దాన్ని డ్రామా, యాక్షన్ సీన్‌గా పోల్చడం అమానుషమని మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు నిజంగా మనిషేనా? మానవత్వం అంటే తెలుసా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి కుర్చీ అందుకున్నారని గుర్తుచేస్తూ, అదే సామాజికవర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక వస్తే, ఆయన భార్య, పిల్లలు ప్రచారం చేయడంలో తప్పేదేంటి? అని ప్రశ్నించారు. మాగంటి కుటుంబం గుండెల్లో నొప్పి ఉందని, ఆ నొప్పిని కూడా రాజకీయ లాభాల కోసం వాడుకోవాలనే కాంగ్రెస్ యత్నం నీచ స్థాయి రాజకీయమన్నారు. నేతల బాధను గౌరవించడం రాజకీయ సంస్కారం అయితే, కాంగ్రెస్ దాన్ని అవమానిస్తోంది అని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా అసహనీయమని, ఇద్దరు మంత్రులు ఒక ఆడబిడ్డపై అలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మహిళల గౌరవాన్ని దిగజార్చే భాష వాడితే ప్రజలు ఎలా నమ్ముతారు? అని ప్రశ్నించారు.
మేయర్ పక్కనే కూచొని వినడం కూడా ఆశ్చర్యమని, కనీసం అక్కడే స్పందించి ఉండి ఉంటే మంచిదని అన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశమంతా సానుభూతి ప్రచారం జరిగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాగంటి కుటుంబం బాధను తప్పు పట్టే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. ‘‘మాగంటి సునీత కన్నీళ్లు రాజకీయం కాదు, జీవితం కోల్పోయిన జీవిత భాగస్వామి జ్ఞాపకం. దాన్ని హాస్యంగా మార్చడం మానవత్వానికి ద్రోహం’’ అని శ్రీనివాస్ గౌడ్ పదునైన వ్యాఖ్యలు చేశారు.
సేనాని (senani.net): మాగంటి సునీత కన్నీళ్లపై కాంగ్రెస్ వ్యాఖ్యలు
RELATED ARTICLES



