Wednesday, October 29, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine
Homeఆర్టికల్స్సేనాని (senani.net): మట్టిని ముద్దాడే చేతులు

సేనాని (senani.net): మట్టిని ముద్దాడే చేతులు

Google search engine

– గ్రామీణ మహిళల గురించి మాట్లాడే రోజు
– అడుగులు నేలమీదైనా, ఆలోచనలు ఆకాశంలో ఎగరేవి
– గ్రామీణ మహిళ శక్తి
14 Oct 2025 (senani.net):మన వ్యవసాయ భూములు పండ్లు ఇవ్వడానికి గింజలు మాత్రమే కాదు, చెమట చిందించే చేతులూ అవసరం. ఆ చేతుల్లో సగం వాటా గ్రామీణ మహిళలదే. పొలంలో విత్తనం వేయడం నుంచి పంటను ఇంటికి తీసుకురావడం వరకు ఆమె పాత్ర నిశ్శబ్దమైనా అమోఘమైనది. అయినప్పటికీ సమాజం చరిత్ర వ్రాయడం మొదలెడితే ఆమె పేరు వంకరపట్టీ కూడా రాస్తుండదు. అందుకే ప్రపంచ దేశాలు అక్టోబర్‌ పదిహేనును గ్రామీణ మహిళల దినోత్సవంగా గుర్తించి, నిశ్శబ్దంగా శ్రమిస్తున్న ఆ మహాశక్తికి గౌరవ వందనం అర్పిస్తున్నాయి. పల్లెలో పుట్టిన అమ్మాయి కళ్లలో ఆశలు ఉంటాయి కానీ వాటిని పలికించుకునే వేదికలు ఉండవు. ఇంటి పనులు, పశువుల సంరక్షణ, పొలాల్లో శ్రమ, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఆమె నిత్యజీవితం. కానీ ఈ శ్రమకు పేరుండదు, గుర్తింపు ఉండదు, వేతనం ఉండదు. మరి ఆమె కృషి లేకుండా పంటలు పండటాయా? ఆహారం ఎలా సిద్ధమవుతుంది? మనం తిన్న ప్రతి ముక్క వెనుక ఆమెలోని శక్తి, ఓర్పు, నమ్మకం ఉన్నాయి. గ్రామీణ మహిళ అంటే బలహీనురాలు కాదు, అత్యంత బలమైన జీవనాధారం. వాతావరణ మార్పులు, ఎండలు, కరువులు, అప్పులు, ఇబ్బందులు ఇవన్నీ ఒక రైతు కుటుంబాన్ని కలవరపెడితే ముందుగా నిలబడేది అదే గ్రామీణ మహిళ. ఇల్లు నిలదొక్కుకోవాలంటే ముందుగా ఆమె శక్తిగా ఉండాలి. కానీ శ్రమిస్తున్న ఆమె చేతిలో నిర్ణయాధికారం ఉండదు. భూమి పత్రాల్లో పేరు ఉండదు. పంట అమ్మకం లో లాభం మీద హక్కు ఉండదు. కష్టానికి కేవలం బాధ్యత మాత్రమే ప్రదానం. ఇదే అసలైన వ్యథ. సమాజం ఆమెను కుటుంబానికి మూలం అని అంటూనే ఆ మూలానికి విలువ ఇవ్వడం మరిచిపోతుంది. గ్రామీణ మహిళ అడుగులు నేలని తాకినా ఆలోచనలు ఆకాశాన్ని తాకగలవు. పిల్లల చదువు, కుటుంబ భవిష్యత్‌, ఆరోగ్యం, గ్రామం అభివృద్ధి వంటి విషయాల్లో ముందుగా ఆలోచించేది ఆమెనే. అయితే ఆమెను కేవలం సహాయక శక్తిగా కాకుండా, నిర్ణయం తీసుకునే శక్తిగా గుర్తిస్తేనే గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఆధునిక యుగంలో ట్రాక్టర్‌, యంత్రం, టెక్నాలజీ పంటను వేగంగా పండిరచగలవు కానీ పంట మీద ప్రేమను మాత్రం మహిళలే నింపగలరు.
కావున గ్రామీణ మహిళల దినోత్సవం అనేది కేవలం ఒక చిహ్నం కాదు. ఇది ఒక బాధ్యతను గుర్తుచేస్తుంది. పల్లెలో కష్టం చేసే ఆ మహిళకు పేరు ఇవ్వాలి, హక్కు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఆమె చెమటను కేవలం పని అని కాకుండా దేశ నిర్మాణంలో భాగమైన శక్తిగా చూడాలి. ఒక మహిళను గౌరవించడం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం. ఒక కుటుంబం నిలబడితే ఒక గ్రామం నిలబడుతుంది. గ్రామం నిలబడితే దేశం బలపడుతుంది. మహిళ అంటే బలహీనురాలు కాదు. ఆమె ఒక కుటుంబానికి వెన్నెముక, సమాజానికి నాడి, రైతు జీవితానికి శ్వాస. ఆమెను గుర్తించే దినోత్సవం ఒక్కరోజే అయినా, ఆమె కృషిని గుర్తించే మన మనసుల దినోత్సవం ప్రతి రోజూ జరగాలి.
గ్రామీణ మహిళలు కేవలం ఇంటి బాధ్యతలు చూసే గృహిణులు మాత్రమే కాదు. వారు ప్రకృతితో మాట్లాడేవారు, మట్టితో సంభాషించేవారు. విత్తనం వేయడానికి ముందు నేలని స్పృశించే ఆ స్పర్శలో ఒక ప్రార్థన ఉంటుంది. పంట మొలకెత్తినప్పుడు ఆమె కళ్లలో కనిపించే ఆనందం తల్లి పిల్లను చూసే ముద్దు చూపు లాంటిది. పట్టణాల్లో జీవితం లెక్కల మీద నడిస్తే, పల్లెల్లో జీవితం భావోద్వేగాల మీద నడుస్తుంది. ఆ భావోద్వేగానికి హృదయమైనది మహిళే. అందుకే ఆర్థికాభివృద్ధి గణాంకాల్లో ఆమె పేరు లేకున్నా, జీవన గణాంకాల్లో ఆమె ప్రభావం మొదటి స్థానంలో ఉంటుంది. చాలా సార్లు ఆమె తాగని చాయ, తినని అన్నం, వేసుకోని బట్టలను మిగిలిన కుటుంబ సభ్యులకు కేటాయిస్తుంది. తన అవసరాల్ని చివరికి నెట్టేసి, కుటుంబాన్ని ముందుకు నెట్టే ఆమె మనసు ఒక పెద్ద రాజ్యానికి కూడా పునాది వేయగల శక్తి. ఈ దినోత్సవం ఒకరోజు మాత్రమే అయినా, అది ఒక పెద్ద ప్రశ్నను అడుగుతుంది ు గౌరవం చెప్పగలుగుతున్నాం, కానీ గౌరవం ఇవ్వగలుగుతున్నామా? గ్రామీణ మహిళ కేవలం సహనానికి ప్రతీక కాదు, మార్పుని మోసుకెళ్లే శక్తి. ఆమెకు విద్యా అవకాశాలు, ఆరోగ్య సదుపాయాలు, ఆర్థిక సాధికారత లభించినప్పుడు గ్రామ చరిత్ర మారుతుంది. ఆమెను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక మహిళను కాదు, ఒక గ్రామ భవిష్యత్తును ప్రోత్సహించడం. నిజమైన పురోగతి పల్లెలో ప్రారంభమవుతుంది, ఆ పురోగతికి అడుగున నిలిచేది ఆ నడకలో అలసిపోని మహిళే.

Google search engine
RELATED ARTICLES
Google search engine
- Advertisment -
Google search engine

Most Popular

Google search engine