– గ్రీన్ ఛానెల్ హామీ కేవలం మాటలేనా
– పెండిరగ్ బిల్లులతో చితికిపోతున్న గురుకులాలు
– విద్యార్థుల నిరసనలు ప్రభుత్వ వైఫల్య సూచన
14 Oct 2025 (senani.net): మాజీ మంత్రి హరీశ్‌రావు గురుకుల విద్యాసంస్థలకు నిధుల కేటాయింపులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న వాగ్దానం కేవలం మాటలకే పరిమితమైందా? అని ప్రశ్నించారు. గురుకులాల్లో చదువుతున్న లక్షలాది బిడ్డల భవిష్యత్తు పై ప్రభుత్వానికి నిజమైన కర్తవ్యబోధ ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో 1024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించడం అవమానకరమని వ్యాఖ్యానించారు. వేల కోట్ల ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేస్తూ, విద్యార్థుల కోసం కనీస నిధులు కేటాయించడం కూడా ప్రభుత్వం తప్పించుకుంటుందా? అని ప్రశ్నించారు. గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని అన్నారు. గురుకులాల్లో మోటార్ల మరమ్మతులు, భవన అద్దెలు, మెస్ చార్జీలు, కాస్మొటిక్, స్టిచ్చింగ్ ఛార్జీలు వంటి మౌలిక అవసరాలూ నెలల తరబడి పెండిరగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండిరగ్ బిల్లుల కారణంగా కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని, తాత్కాలిక సిబ్బంది వేతనాల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గురుకులాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసనలకు దిగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. బడులు పట్టాల్సిన పిల్లలు రోడ్లపై సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం దుర్ఘటనగా అభివర్ణించారు. సమీక్షలు నిర్వహించడం కాదు, సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఛానెల్ పేరుతో ప్రకటించిన నిధుల విడుదల ఇంకా అమలులోకి రాలేదని గుర్తుచేశారు. ఫోటోలు, ప్రచారాలతో కాకుండా వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గురుకులాల గౌరవం, నాణ్యత కాపాడాలంటే వెంటనే చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ స్పందనతో పూర్తి స్థాయి నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలకోసం నిలిపివేయరాదని, విద్యా రంగం పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఇదేనని హెచ్చరించారు.
సేనాని (senani.net): గురుకుల నిధులపై హరీశ్‌రావు ప్రశ్నలు
RELATED ARTICLES



