– ప్రయాణ భద్రతపై పెరుగుతున్న అనుమానాలు
14 Oct 2025 (senani.net): ఆకాశయానాన్ని మనుషులే అత్యంత సురక్షిత ప్రయాణ మార్గంగా భావిస్తారు. కాలాన్ని జయిస్తూ, సముద్రాలు, అరణ్యాలు దాటి వేగంగా చేరుకునే మార్గంగా విమానాలు ప్రపంచాన్ని దగ్గర చేశాయి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఈ నమ్మకాన్ని కదిలిస్తున్నాయి. ప్రయాణ సౌలభ్యం పెరిగినా, భద్రత విషయంలో ప్రశ్నార్థకం ఎత్తి చూపే ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. చిన్న ప్రాంతాల నుంచే విమాన సౌకర్యం అందుబాటులోకి రావడంతో, ఎయిర్ ట్రాఫిక్ అమితంగా పెరిగింది. కానీ ట్రాఫిక్ పర్యవేక్షణకు కావలసిన సిబ్బంది, ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అంత వేగంగా అభివృద్ధి చెందలేదు. ఒక్క పొరపాటు సంకేతం లేదా సమన్వయం లోపం కూడా ప్రమాదానికి దారి తీస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేదా వర్షపు మబ్బులతో కూడిన పరిస్థితుల్లో నియంత్రణ కేంద్రాలపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.
ప్రమాదాలపై అధ్యయనాలు చెబుతున్నాయి : మెంటినెన్స్ లోపాలు ముఖ్య కారణంగా మారుతున్నాయని. ప్రైవేట్ సంస్థలు లాభ నష్టాల లెక్కలతో మెంటినెన్స్ ప్రక్రియలను వేగంగా ముగించాలని చూస్తున్నాయి. ఇంజనీర్లకు తగిన సమయం ఇవ్వకపోవడం, విడిభాగాల మార్పులు పూర్తి తనిఖీ చేయకుండా జరగడం వంటి అంశాలు ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. ఒక చిన్న సాంకేతిక లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రయాణికుల జీవితాల్ని బలి తీసుకుంటుంది. మరో ముఖ్య కారణం మానవ తప్పిదాలు. విమానం నడిపే పైలట్లపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. వరుస ప్రయాణాలు, విశ్రాంతి లేకపోవడం, మానసిక అలసట నిర్ణయ సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. విమానం గాల్లో ఉన్నప్పుడే అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయంలో, అలసటతో కూడిన స్పందన ప్రమాదాన్ని మరింత తీవ్రమజేస్తుంది. పైలట్లకు కేవలం శిక్షణ కాకుండా మానసిక సమతుల్యత కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించే విధానం ఉండాలి. పలు దేశాల్లో పాతబడిన విమానాలు ఇంకా సేవల్లో ఉన్నాయి. యంత్రాల ప్రాణకాలం పూర్తయినా, కొత్త విమానాలు కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో సంస్థలు వాటిని మరమ్మతుల పేరుతో కొనసాగిస్తున్నాయి. కానీ వయసు పైబడిన యంత్రాంగంలో లోపాలు కనిపించకుండా ఉండటం కష్టం. ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించి ఇలాంటి ప్రమాదకర ధోరణిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అంతర్జాతీయ విమాన నియంత్రణ సంస్థలు మార్గదర్శకాలు రూపొందించినా, వాటి అమలులో దేశాల మధ్య స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. కొన్ని దేశాలు కఠిన తనిఖీలు చేపట్టగా, మరికొన్ని ప్రాంతాల్లో పత్రాల పరిశీలనతోనే అనుమతులు ఇస్తున్నారు. విమాన భద్రత కోసం నియమాలు ఒక్కటిగా ఉన్నా, వాటి అమలు మాత్రం అసమానంగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది.
ప్రమాదాల నేపథ్యంలో విమానయాన భద్రతపై పలు నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన సాంకేతిక నిపుణుడు రమణారెడ్డి అభిప్రాయం ప్రకారం, మెంటినెన్స్ వివరాలు ప్రజలకు అందుబాటు లో పెట్టే పారదర్శక వ్యవస్థ అవసరమన్నారు. విమాన నియంత్రణ సేవల్లో పనిచేసిన మాజీ పైలట్ అజయ్‌కుమార్ అభిప్రాయమేమంటే, పైలట్లకు ప్రతి ప్రయాణానికి మద్య తప్పనిసరిగా విశ్రాంతి సమయం ఇవ్వాలని అన్నారు. అంతర్జాతీయ భద్రతా విశ్లేషకుడు సునీల్‌వర్మ చెప్పిందేమిటంటే, పాత విమానాలకు అనుమతులు ఇవ్వడానికి ముందు మూడు స్థాయిల సాంకేతిక తనిఖీలు తప్పనిసరి చేయాలని సూచించారు.
విమాన ప్రయాణం ఇప్పటికీ వేగవంతమైన మార్గం. కానీ వేగంతో పాటు జాగ్రత్త కూడా సమాన నిష్పత్తిలో ఉండాలి. భద్రతా నియంత్రణ కేవలం పత్రాల పరిమితిలో కాకుండా, యంత్రాల హృదయ స్పందనను పరీక్షించే స్థాయిలో ఉండాలి. విమాన ప్రయాణం ఒక ఆభరణంలాంటిది ఎంత మెరుస్తున్నా, లోపలి బలం లేకపోతే అది ఏ క్షణమైనా విరిగిపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, సంస్థలు, సాంకేతిక నిపుణులు కలిసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడే దిశగా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
– విశ్లేషణ :M రాజు పాత్రికేయులు
సేనాని (senani.net): ఆకాశ మార్గంలో పెరుగుతున్న ప్రమాదాలు
RELATED ARTICLES



