– అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం
15 Oct 2025 (senani.net):చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక అనుమతి లేకుండా ఆ ఖనిజాలను విదేశాలకు పంపరాదని బీజింగ్ నిర్ణయించడం ద్వారా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రపంచ మార్కెట్ల సరఫరా వ్యవస్థను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా ఒక్కదానిగా నిలబడలేదని, భారత్ వంటి దేశాల మద్దతు తప్పనిసరి అని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అరుదైన ఖనిజాల రంగంలో చైనాకు ప్రత్యామ్నాయం సృష్టించాలంటే భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌పై పన్నులు విధించిన అమెరికా, ఇప్పుడు చైనా విషయంలో మాత్రం ఢల్లీికే సహకారం కోరడం విశేషంగా మారింది.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. చైనా ఈ ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించిందని, దీనికి అమెరికా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గ్లోబల్ సప్లై చైన్‌ను రక్షించాలంటే భారత్, ఐరోపా దేశాలు కలిసి రావాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం అమెరికా కృషి చేస్తుంటే, చైనా మాత్రం ఆర్థిక ఆధిపత్య రాజకీయాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
భారత్ ప్రపంచ వేదికపై పెరుగుతున్న ప్రభావంతో వాషింగ్టన్ ఢల్లీి వైపు మరింత ఆసక్తిగా చూడడం ప్రారంభించింది. అరుదైన ఖనిజాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించాలంటే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని అమెరికా స్పష్టంగా అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ రంగాలు ఈ అరుదైన ఖనిజాలపై ఆధారపడిన నేపథ్యంలో చైనా చర్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తన సహజ వనరుల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంటే, గ్లోబల్ సప్లై చైన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా నిలిచే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఇప్పటికే ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో కొత్త వనరుల అన్వేషణ కోసం భారత్ చురుకుగా ముందుకు వస్తుండటం అమెరికా దృష్టిని ఆకర్షించింది.
చైనా ప్రభావాన్ని తగ్గించే దిశగా క్వాడ్ దేశాలు కూడా వనరుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో భారత్ పాత్ర మరింత వ్యూహాత్మకంగా మారుతోంది. అమెరికా పన్నుల నిర్ణయాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, చైనా అంశంలో రెండు దేశాల ప్రయోజనాలు ఒకే దిశగా ఉండటం వల్ల కొత్త దౌత్య వేదికలు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది.



