– తొలి జాబితా ప్రకటింపు
15 Oct 2025 (senani.net):బీహార్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే బీజేపీ 71 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ బరిలోకి దిగింది. దానికి సమాంతరంగా జేడీయూ కూడా నేడు తన తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 57 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలో కీలక నియోజకవర్గాల నుంచి ప్రముఖ నాయకులకు అవకాశం దక్కింది. రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్, కల్యాణ్‌పూర్ నుంచి మహేశ్వర్ హజారా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషాద్, సోన్‌బస్రా నుంచి రత్నేశ్ సదా, మొకమా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుశ్వాహ, ఎక్మా నుంచి ధమల్ సింగ్ పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ జాబితాతో జేడీయూ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. బీహార్ ఎన్నికల్లో ఈసారి ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మొత్తం 243 స్థానాల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లు పంచుకోగా, చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని ఎల్‌జేపీ (ఆర్)కు 29 స్థానాలు, మిగిలిన ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎం (ఎస్) పార్టీలకు ఆరు స్థానాలు కేటాయించారు. సీట్ల పంపకాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే వెల్లడిరచారు.
రెండు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత నవంబర్ 11న నిర్వహించనున్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపధ్యంలో జేడీయూ జాబితా విడుదలతో బీహార్ ఎన్నికల రంగంలో పోటీ మరింత హోరాహోరీగా మారింది.



