15 Oct 2025 (senani.net): పదమూడో సీజన్ వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా జట్టు పై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలిన తర్వాత ఆ జట్టు సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఒక్క పరాభవాన్ని కొత్త ప్రేరణగా మార్చుకున్న సఫారీ జట్టు అనూహ్యంగా మళ్లీ నిలదొక్కుకుంది. ఒత్తిడిని జయిస్తూ సమిష్టి శక్తితో రాణిస్తోన్న వారు వరుస విజయాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో జరిగిన వైఫల్యాన్ని మరిచి ‘ఇదే మా అసలు రంగు’ అని చెప్పేలా ఆటతీరును మార్చుకున్నారు. బలమైన జట్లను వరుసగా ఓడిరచడం దక్షిణాఫ్రికా జట్టు కొత్త ధోరణిగా మారింది. న్యూజిలాండ్‌పై విజయం సాధించిన వెంటనే భారత్, బంగ్లాదేశ్ జట్లను సైతం సునాయాసంగా మట్టికరిపించడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. టాప్ ఆర్డర్ విఫలమైనా మిడిల్ ఆర్డర్ నిలబడి జట్టును గెలుపు దిశగా నడిపించడం ప్రత్యేకతగా మారింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్, తంజిమ్ బ్రిట్స్, సునే లస్ బాధ్యతాయుతంగా ఆడితే.. లోయర్ ఆర్డర్‌లో డీక్లెర్క్ వంటి ప్లేయర్లు మ్యాచ్‌ను ఫినిష్ చేసే స్థాయిలో ఉన్నారు. ఒకరిపై ఆధారపడకుండా అందరూ తమ వంతు పాత్ర పోషించడం సఫారీల విజయ రహస్యం అని చెప్పవచ్చు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ యూనిట్ కూడా అదే తీవ్రతను ప్రదర్శిస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్లాబా మూడు మ్యాచుల్లో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచింది. మరినే కాప్, క్లో ట్రయాన్ వంటి ఆల్‌రౌండర్లు బ్యాట్, బాల్ రెండు విభాగాల్లోనూ తోడ్పడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో కొత్త హీరో కనిపించడం ఆ జట్టు బలం ఎంత ఉందో స్పష్టంగా చెబుతోంది. తొలి ఓటమిని మరచి అంతా ఒకే దిశగా కదులుతున్న ఈ జట్టు తన తొలి ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చే దిశగా మరింత వేగంగా దూసుకెళ్తోంది.



