– కోల్డ్రిఫ్ దగ్గుమందులో విషపదార్థం గుర్తింపు కలకలం
– ప్రాణాంతక డైఇథలీన్ గ్లైకాల్ కలిపిన కోల్డ్రిఫ్ సిరప్‌పై చర్య
– శ్రీసన్ ఫార్మసీ పూర్తిగా మూసివేత
– ఇతర ఫార్మా కంపెనీలపై విస్తృత తనిఖీలు
– డ్రగ్ అధికారులపై కూడా విచారణ ప్రారంభం
14 Oct 2025 (senani.net): చెన్నై: శ్రీసన్ ఫార్మసిట్యుకల్స్ తయారు చేస్తున్న కోల్డ్రిఫ్ దగ్గుమందులో ప్రమాదకరమైన డైఇథలీన్ గ్లైకాల్ పదార్థం ఉండటంతో, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ శాఖ భారీ చర్య తీసుకుంది. సంస్థకు ఉన్న తయారీ లైసెన్సును వెంటనే రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లో చింద్వారా జిల్లాలో ఇటీవల 21 మంది చిన్నారులు ఈ మందు సేవించి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అలర్ట్ అవుతూ చెన్నై ల్యాబ్‌లో కోల్డ్రిఫ్ సహా ఇతర తయారీ ఉత్పత్తులను పరీక్షించారు. దర్యాప్తులో డీఈజీ కలిసినట్లు తేలడంతో ప్రభుత్వం నేరుగా సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. 2011లో లైసెన్సు జారీ చేసి, 2016లో రీన్యువల్ చేసిన శ్రీసన్ ఫార్మసీపై ఇక కొనసాగడానికి అవకాశం లేకుండా తలుపులు మూసేశారు. ఈ కేసులో కంపెనీ యజమాని రంగనాథన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సరిగా తనిఖీలు నిర్వహించని ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసి, కొందరు ఉన్నత అధికారులపై కూడా ఎడీ సోదాలు ప్రారంభించింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్రగ్ తయారీ యూనిట్లపై కఠిన తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



