– నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
– ఏలూరు సహా పలు జిల్లాల్లో వర్షాల సూచన
– పిడుగులు పడే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరిక
14 Oct 2025 (senani.net): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తన పరిస్థితులు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. దానికి తోడు దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వర్షాలు మరింత తీవ్రంగా కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడిరచారు. అలాగే అల్లూరి, కోనసీమ, తూర్పు, పడమర గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెట్లు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని స్పష్టమైన సూచనలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పశుపోషకులు వాతావరణ పరిస్థితులను గమనించి వ్యవసాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
సేనాని (senani.net): ఉపరితల ఆవర్తన ప్రభావం
RELATED ARTICLES



