15 Oct 2025 (senani.net):బెంగళూరులో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ పేలవంగా ఉండటంతో వర్షాలు పడితే నగరం నీట మునిగిపోతుందని నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి కూడా ప్రభుత్వం కనీస సౌకర్యాలు అందించడంలో విఫలమైందని, ఇలాంటి పరిస్థితుల్లో మేం పన్నులు ఎందుకు కట్టాలంటూ ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్ ఫోరం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాసి తమ ఆవేదనను తెలియజేశారు. పౌరులు చెల్లించే ప్రాపర్టీ టాక్స్ నగర అభివృద్ధి పనులకే వినియోగించాలనే ఉద్దేశంతో వసూలు చేస్తుంటారు. కానీ రోడ్లు పాడైపోవడం, గుంతలు పెరగడం, డ్రైనేజీ సర్దుబాటు లేకపోవడం వంటి సమస్యలు రోజువారీ ఇబ్బందులకు దారితీస్తున్నాయని ఫోరం ఆక్షేపించింది. ప్రజల సొమ్ముతో నడుస్తున్న గ్రేటర్ బెంగళూరు సంస్థ కనీస బాధ్యత తీసుకోవడంలో విఫలమైందని, అందువల్ల వారికి టాక్స్ వసూలు చేసే హక్కు లేదని స్పష్టం చేసింది. ఇటీవలి వర్షాల వల్ల నగరంలోని అనేక కాలనీలు, రహదారులు మునిగిపోయిన దృశ్యాలు ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతున్నాయి. నీరు వెళ్లే మార్గాలు లేకపోవడం, డ్రైనేజీ లైన్లు బ్లాక్ కావడం వంటి సమస్యలు పరిష్కరించకుండా కేవలం గుంతలు పూడ్చడం ప్రజలకు ఉపయోగం లేకుండా చేస్తోందని ఫోరం స్పష్టం చేసింది. గుంతలు మూసివేయడం తాత్కాలిక చర్య అయినా, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణమే శాశ్వత పరిష్కారమని పేర్కొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ బెంగళూరులో 13 వేలకుపైగా గుంతలను పూడ్చివేశామని, మొత్తం 550 రోడ్లను రూ.1100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అయితే పౌరులు మాత్రం డ్రైనేజీ, రహదారి నిర్మాణ వ్యవస్థలో పారదర్శకత, నాణ్యతతో కూడిన పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం పేపర్‌పైనే మిగలకుండా, నేల మీద కనిపించాలనే అభిప్రాయమే ఇప్పుడు నగరంలో ప్రధాన చర్చగా మారింది.



