15 Oct 2025 (senani.net):హర్యానాలో ఏఎస్‌ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య కేసు మరింత ఉత్కంఠభరిత మలుపు తీసుకుంది. సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని దహనం చేయడానికి నిరాకరిస్తూ, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పురన్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోప్‌ాతక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహంతో రోడ్లపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన చుట్టూ చట్టసంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సందీప్ మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్, వీడియోలో ఐపీఎస్ అధికారి వై.పురన్ కుమార్ అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అవినీతి వ్యతిరేకంగా నిలబడినందుకే తనపై టార్గెట్ చేసుకుని వేధింపులు జరిపారని, న్యాయం లభించకపోవడంతోనే ప్రాణత్యాగం చేస్తున్నానని సందీప్ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబం వెల్లడిస్తోంది. కేసు విచారణలో ఉన్నతాధికారుల పేర్లు రావడంతో ఇది కేవలం ఆత్మహత్య సంఘటనగా మిగిలిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సందీప్ ఆత్మహత్యతో స్థానిక ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు ఉధృతమయ్యాయి. ఒక నిజాయితీ గల అధికారి ఇలా ప్రాణాలు కోల్పోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘‘అవినీతి అధికారులను కాపాడి, నిజం మాట్లాడినవారినే వేధించే వ్యవస్థే దేశానికి ప్రమాదం’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. గ్రామస్తులు, మాజీ సైనికులు, యువకులు పెద్ద సంఖ్యలో రహదారులపై దిగ్బంధం చేపట్టారు.
ఇదిలా ఉండగా, సందీప్ కుటుంబం వెల్లడిరచిన ఆరోపణల్లో ఐపీఎస్ అధికారి పురన్ కుమార్ 2,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారనే అంశం పెద్ద చర్చగా మారింది. ఒక ప్రభుత్వ అధికారి ఇంత పెద్ద స్థాయిలో ఆస్తులు సంపాదించడంపై ఎలా విచారణ జరగలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ముందు వచ్చిన ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని పిలుపులు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాలు కూడా ఈ కేసుపై స్పందించక తప్పదనే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక ఇప్పుడు దృష్టంతా హర్యానా ప్రభుత్వంపై ఉంది. ఐఏఎస్ అధికారిణిని అరెస్ట్ చేయాలంటూ కుటుంబం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో, చట్టపరమైన ప్రక్రియ వేగవంతం చేయకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్త రూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పోలీసు శాఖలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకోవడం, అవినీతిపై పోరాటం చేస్తున్న అధికారులే లక్ష్యంగా మారడం సమాజంలో అసంతృప్తిని పెంచుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



