– 1800 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు
– హెలిపాడ్ నుంచి ఆలయం వరకు విస్తృత తనిఖీలు
– జోన్లుగా విభజించి పోలీసు బృందాలకు డ్యూటీలు కేటాయింపు
– ప్రతి వాహనంపై క్షుణ్ణమైన తనిఖీలు, కమాండ్ కంట్రోల్ మానిటరింగ్
14 Oct 2025 (senani.net): ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ప్రకటించారు. మొత్తం 1800 మంది పోలీసు సిబ్బందిని మోహరించి కీలక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాని హెలిపాడ్‌కు చేరుకునే సమయం నుంచి దర్శనం ముగిసే వరకు ప్రతి మూలను జియోగ్రాఫికల్ మ్యాప్ ఆధారంగా గుర్తించి తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలిపాడ్, ఆలయ పరిసరాలు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి యాక్సెస్ కంట్రోల్ అమలు చేయాలని సూచించారు. రూట్‌మాప్‌పై క్షుణ్ణమైన పర్యవేక్షణ కోసం రూడ్‌టాప్ టీమ్స్, క్యూ ఆర్టీ బృందాలు, ప్రత్యేక పహారా బృందాలను నియమించారు. ప్రతి పోలీసు సిబ్బందికి ప్రత్యేక డ్యూటీ పాసులు జారీ చేసి, ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. కీలక పాయింట్ల వద్ద కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం మానిటరింగ్ జరుగుతుందని ఎస్పీ సునీల్ తెలిపారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని 24 గంటల పాటు తనిఖీ చేస్తూ, ఎలాంటి అనుమానాస్పద కదలికను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
సేనాని (senani.net): ప్రధాని శ్రీశైలం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
RELATED ARTICLES



