– విదేశీ అతిథి వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డ బయోకాన్ అధిపతి
14 Oct 2025 (senani.net): బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా, బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఒక విదేశీ బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలను బయటపెట్టారు. నగరానికి వచ్చిన ఆ అతిథి, ‘‘ఇంత టెక్ నగరమని పేరు ఉన్న బెంగళూరులో రోడ్లపై, రోడ్ల చుట్టూ ఇంత చెత్త ఎందుకుంది?’’ అని ప్రశ్నించడంతో తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె ‘ఎక్స్’ వేదికలో రాశారు. ఈ ట్వీట్‌లోనే ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను నేరుగా ట్యాగ్ చేసి ఈ సమస్యపై స్పందించాలని కోరారు. ఆ విదేశీ విజిటర్ ఇంకా మాట్లాడుతూ, ‘‘నేను ఇప్పుడే చైనా నుంచి వచ్చాను. అక్కడ మౌలిక వసతులు బాగున్నాయి. ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం ఉన్నా, రోడ్ల పరిస్థితి ఇంత చెడ్డగా ఎందుకు ఉంది?’’ అని ప్రశ్నించినట్లు కిరణ్ వివరించారు. ‘‘ప్రభుత్వం నిజంగా గ్లోబల్ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తే, మొదట మౌలిక వసతులను సరిచేయాలి’’ అనే భావన వారికి కలిగిందని ఆమె తెలిపారు. భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో బెంగళూరులో రోడ్లు గుంతలమయంగా మారడం కొత్త విషయం కాదు. గతంలోనూ బ్లాక్‌బక్ సీఈవో రాజేశ్ యాబాజీ బెంగళూరు రోడ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో ‘‘ఇంటి నుంచి కార్యాలయానికి రావడం ఒకప్పుడు ఆనందంగా ఉండేది, ఇప్పుడు ఆలోచించడానికే భయం వేస్తోంది’’ అని సోషల్ మీడియాలో రాసిన ఆయన పోస్టు వైరల్ అయిన విషయం తెలిసిందే.



