15 Oct 2025 (senani.net):న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలోనూ యువత సత్తా చాటుతోంది. వినూత్న వ్యాపారాలతో తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నాటికి 155 మంది యువత వినూత్న వ్యాపారాలతో 44,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.39 లక్షల కోట్లు) సంపద సృష్టించింది. ప్రస్తుత మన జీడీపీ లో ఇది దాదాపు 10 శాతానికి సమానం. నాలుగు పదుల వయసు కూడా నిండకుండానే వీరు ఈ సంపద సృష్టించినట్టు మంగళవారం వెలువడిన ‘ది అవెండాస వెల్త్-హురున్ ఇండియా అండర్ 35 లిస్ట్ 2025’ నివేదిక వెల్లడిరచింది. ఈ జాబితాలో రేజన్ సోలార్‌కు చెందిన హార్దిక్ కొటియా అగ్రస్థానంలో ఉండగా వికాస్ గోయల్ (కుకు ఎఫ్‌ఎం), మిను మార్గరెట్ (బ్లిస్ క్లబ్), రితేష్ అగర్వాల్ (ఓయో, ప్రిజమ్) ఉన్నారు. అలాగే ఇషా అంబానీ (రిలయన్స్ రిటైల్), కావ్య కళానిధి మారన్ (సన్ టీవీ నెట్‌వర్క్), రితిక మోహన్ (గరుడ ఏరోస్పేస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి, అవంతీ ఫీడ్స్‌కు చెందిన అల్లూరి వెంకట సంజీవ్, అశీష్ గోయెంకాలతో పాటు మరో ముగ్గురు యువ పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. ఈ యువ పారిశ్రామిక దిగ్గజాలందరూ సంపదతో పాటు వ్యవస్థలనూ నిర్మిస్తున్నారని హురున్ ఇండియా నివేదిక కితాబిచ్చింది., ఎంపిక ఇలా: ఈ జాబితా ఎంపిక కోసం కొన్ని నిర్ధిష్ట ప్రామాణికాలు పాటించారు. తొలి తరం పారిశ్రామికవేత్తలైతే వారు సృష్టించిన కనీస సంపద విలువ ఐదు కోట్ల డాలర్లకు మించి, అదే వారసత్వ కుటుంబ వ్యాపారమైతే 10 కోట్ల డాలర్లకు మించి ఉండాలని ప్రామాణికంగా నిర్ణయించారు. మరోవైపు సంపద సృష్టితో పాటు ఈ యువ పారిశ్రామికవేత్తలు ఉద్యోగాల కల్పనలోనూ ముందున్నారు. ప్రస్తుతం వీరి కంపెనీల్లో 7.67 లక్షల మంది పనిచేస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇందులో ఇషా అంబానీ (33) నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌లో అత్యధికంగా 2,47,782 మంది పని చేస్తున్నారు. ఆకాశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు.



