‘స్కేరీ పిక్చర్‌’లో కంగనా రనౌత్‌..

‘స్కేరీ పిక్చర్‌’లో కంగనా రనౌత్‌..

హైదరాబాద్‌, నవంబరు 13 (భారత్ ప్రతినిధి): నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రవిబాబు ఓ హారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘స్కేరీ పిక్చర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి. సురేష్‌బాబు నిర్మిస్తుండగా, హీరో, నిర్మాత రానా దగ్గుబాటి కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
న్యూఢిల్లీలో నిర్వహించిన ‘హారర్‌కాన్‌ ఇండియా’ కార్యక్రమంలో రానా ఈ సినిమా వివరాలను వెల్లడించారు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 2009లో ప్రభాస్‌ సరసన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రంలో కంగనా నటించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుండటంతో, ఆమె రీఎంట్రీపై చర్చ మొదలైంది. అయితే ఇది తెలుగు సినిమా కాకుండా రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రంగా తెలుస్తోంది.
విభిన్నమైన కథాంశాలతో హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవిబాబు ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కంగనా ప్రధాన పాత్ర, రవిబాబు దర్శకత్వం, సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణం, రానా భాగస్వామ్యం కలగలిసిన ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.