తెలంగాణను దేశానికే క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం

- – ఎల్బీ స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ సముదాయం ప్రారంభం
- – ఖేలో ఇండియా నిర్వహణకు అన్ని శాఖల సమన్వయం
- – గ్రామీణ క్రీడాకారులకూ సమాన అవకాశాలు కల్పిస్తాం
- – యువత క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు, ఉన్నత విద్యలో అవకాశాలు
- – మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 4 (సేనాని ప్రతినిధి): తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ సముదాయాన్ని మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సాధనకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కప్‌తో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నిరుపయోగంగా ఉన్న క్రీడా మైదానాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, యంగ్ ఇండియా క్రీడా పాఠశాలల ద్వారా తెలంగాణను దేశంలోనే క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఈ పోటీల విజయవంతానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, పోలీసు శాఖలతో పాటు ఇతర విభాగాల నుంచి పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు. క్రీడా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనూ ఖేలో ఇండియా పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. క్రీడా కార్యక్రమాలను హైదరాబాద్‌కే, జిల్లా కేంద్రాలకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల క్రీడాకారులకు అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. కరీంనగర్ క్రీడా పాఠశాల వంటి సంస్థలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే అపోహ నుంచి యువత బయటకు రావాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యలో ప్రవేశాలకు కూడా అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. క్రీడాకారుల విజయాల వెనుక క్రీడా ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి, చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఖేలో ఇండియా నిర్వహణలో తెలంగాణ ఆతిథ్యాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసించేలా మంత్రులు, అధికారులు, క్రీడా సంఘాలు సమష్టిగా కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, గ్రామీణ యువతకు కూడా సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీ బాలదేవి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, శంకర్ గీతా కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.