తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కాజల్‌!

తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కాజల్‌!

హైదరాబాద్‌, నవంబరు 13 (భారత్ ప్రతినిధి): దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరిస్తున్న కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ’ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అత్యంత భయానక సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆరేళ్ల క్రితం ‘ఇండియన్‌ 2’ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో తాను తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయాన్ని వెల్లడించారు.
2020లో దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుండగా భారీ క్రేన్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఆ సమయంలో చిత్రీకరణ ప్రదేశంలోనే ఉన్న కాజల్‌ కూడా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆ రోజును గుర్తుచేసుకుంటూ.. తన జీవితంలో అదొక ఎప్పటికీ మర్చిపోలేని పీడకల అని చెప్పారు. సినిమాలో ఓ కీలకమైన పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని, తాను 80 ఏళ్ల వృద్ధురాలి పాత్ర కోసం ప్రత్యేక అలంకరణలో ఉన్నానని తెలిపారు. చిత్రీకరణ ప్రదేశంలోని మానిటర్‌ వద్ద కూర్చుని ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దం, ఆర్తనాదాలు వినిపించాయని గుర్తుచేసుకున్నారు.
ఏం జరిగిందో తెలుసుకునేలోపే సుమారు 100 అడుగుల ఎత్తున్న క్రేన్‌ కుప్పకూలిందని కాజల్‌ తెలిపారు. అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారని, తాను కూడా తప్పించుకునే క్రమంలో ఓ బల్లను బలంగా ఢీకొని కిందపడిపోయానని చెప్పారు. భారీ క్రేన్‌ తనవైపే కూలాల్సి ఉందని, కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే పెను ప్రమాదం నుంచి బయటపడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో ఏం జరిగిందో, తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఘటన తనకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు.
ప్రమాదానికి సరిగ్గా వారం రోజుల ముందే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని కూడా కాజల్‌ గుర్తుచేసుకున్నారు. నటిగా తన కెరీర్‌లో అదొక గొప్ప మైలురాయి అని, ఆ ఆనందంలో ఉన్న సమయంలోనే ఇలాంటి భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవైపు అరుదైన గౌరవం దక్కిన సంతోషం, మరోవైపు కళ్లముందే మృత్యువు కనిపించినంతటి భయం.. ఈ రెండింటి మధ్య కేవలం వారం రోజుల వ్యవధి ఉండటం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. పెద్దగా గాయాలు కాకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడటం తన అదృష్టమని కాజల్‌ పేర్కొన్నారు.