వైసీపీని వీడి టీడీపీలో చేరిన 400 మంది కార్యకర్తలు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 400 మంది కార్యకర్తలు
  • – శ్రీకాకుళంలో భారీగా పార్టీలోకి చేరికలు
  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కార్యక్రమం
  • – 16 ఏళ్ల తర్వాత జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలు
  • – కూటమి ప్రభుత్వ అభివృద్ధే తమకు బలమంటున్న అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, నవంబర్ 14 (భారత్ ప్రతినిధి): శ్రీకాకుళం నగరంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 400 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీకాకుళం నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే తాము టీడీపీలో చేరినట్లు వారు వెల్లడించారు. 16 ఏళ్ల తర్వాత జరగనున్న శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారీ చేరికల కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. చౌదరి పురుషోత్తమ నాయుడు, గురుకుపల్లి లోకనాథం, చౌదరి సతీష్, బుర్ర వెంకట్రావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, పి. రమణ, పైడి రాజారావు తదితరులతో పాటు 400 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
గతంలో ఎమ్మెల్యేలుగా, సీనియర్ మంత్రులుగా పనిచేసిన వారు శ్రీకాకుళం నగర అభివృద్ధిని పట్టించుకోలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారని ఆరోపించారు. ఈ కారణంగానే 16 ఏళ్ల పాటు శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గత 28 నెలల పాలనలో శ్రీకాకుళం నగరంలో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసే పలువురు టీడీపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా ఎన్నికల కార్యాచరణలో పాల్గొనాలని సూచించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 400 మంది కార్యకర్తల చేరికతో శ్రీకాకుళం రాజకీయాల్లో ఈ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.