వర్ష జీవితంలో విషాదాలు.. అన్నయ్య కోసం కన్నీటి పోరాటం!

హైదరాబాద్, నవంబరు 13 (భారత్ ప్రతినిధి): బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు వర్ష. ‘జబర్దస్త్’ కామెడీ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తనదైన నటన, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘పోవే పోరా’ వంటి కార్యక్రమాల్లోనూ సందడి చేశారు. తెరపై నవ్వులు పంచే వర్ష వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం, తండ్రి జ్ఞాపకాలు, తల్లి ఆరోగ్యం, అన్నయ్యకు జరిగిన ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించి భావోద్వేగానికి గురయ్యారు.
ప్రతి అమ్మాయికి తండ్రే మొదటి కథానాయకుడని చెప్పిన వర్ష.. తన జీవితంలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తండ్రితో కలిసి అన్నవరం, తలుపులమ్మ లోవ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ ప్రయాణాల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు ఆ రోజులు తిరిగి రావని బాధపడ్డారు. తండ్రి మరణం తర్వాత కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ముఖ్యంగా తల్లి ఒంటరిగా మారిపోయారని చెప్పారు. గతంలో ప్రతి చిన్న విషయానికీ తండ్రిపై ఆధారపడే తల్లి.. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తల్లి ఆరోగ్య సమస్యలు కూడా తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన చిన్నన్నయ్యకు సంక్రాంతి కార్యక్రమం సమయంలో జరిగిన ప్రమాదం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని వర్ష వెల్లడించారు. ఆ ప్రమాదంలో అన్నయ్య తలకు తీవ్ర గాయమై, మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారట. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఆమె.. అన్నయ్యను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంత ఖర్చయినా సరే అన్నయ్యను బతికించాలని వైద్యులను వేడుకున్నానని గుర్తుచేసుకున్నారు.
అన్నయ్య మూడు రోజుల పాటు అత్యవసర చికిత్స విభాగంలో ఉన్న సమయంలో తాను నిద్రలేకుండా గడిపానని వర్ష తెలిపారు. ఆసుపత్రి బయట కాలువ పక్కన కూర్చుని అన్నయ్య కోలుకోవాలని ఎదురుచూశానని చెప్పారు. అప్పటికే తండ్రి మరణం, తల్లి ఆరోగ్య సమస్యలతో కుటుంబం ఇబ్బందుల్లో ఉండటంతో ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తానే బాధ్యత తీసుకున్నానని వివరించారు. ఆ క్లిష్ట సమయంలో నటి రోజా తనకు అండగా నిలిచారని, ‘ఏమీ టెన్షన్ పడకు వర్షా.. మేమున్నాం’ అంటూ ధైర్యం చెప్పారని వెల్లడించారు.
మూడు రోజుల తర్వాత అన్నయ్యకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని వర్ష తెలిపారు. అయితే అన్నయ్యను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యానని గుర్తుచేసుకున్నారు. కరోనా అనుభవం తనకు జీవిత విలువను తెలియజేసిందని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. అందుకే జీవితంలో ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని వర్ష చెప్పుకొచ్చారు.