వర్షంలోనూ తగ్గని కూటమి ప్రచార జోరు!

వర్షంలోనూ తగ్గని కూటమి ప్రచార జోరు!
  • – నందివాడలో ఐదు గ్రామాల్లో వెనిగండ్ల రాము పర్యటన
  • – బైక్‌ ర్యాలీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
  • – కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
  • – నవంబర్ 5న ఆత్మసాక్షిగా ఓటేయాలని పిలుపు

కృష్ణా, నవంబర్ 3 (సేనాని ప్రతినిధి): జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నందివాడ మండలంలో కూటమి శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మండలంలోని రుద్రపాక, గోపాలపురం, గొంగళ్లమూడి, పోలుకొండ, నందివాడ గ్రామాల్లో పర్యటించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీల్లో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి కోసం పనిచేసే నాయకులనే ఎన్నుకోవాలనే అభిప్రాయం గ్రామాల్లో వ్యక్తమవుతోందని అన్నారు.
పని చేయని నాయకులు తమకు ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గతంలో అరాచకాలు, దోపిడీ రాజకీయాలకు పాల్పడిన వైకాపాకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే నాయకత్వానికి ఓటు వేయాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులను ఆదరించాలని ఓటర్లను కోరారు. నవంబర్ 5న జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. నందివాడ మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడి అభ్యర్థి దుడ్ల రాజ ప్రదీప్‌కుమార్‌తో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ అభీష్టం మేరకు ఓటు వేయాలని సూచించారు.
ఎన్నికలు ముగిసిన అనంతరం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదు గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలతో నందివాడ మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.