వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా?

వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా?

హైదరాబాద్‌, నవంబరు 8 (సేనాని ప్రతినిధి): నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తనయుడి తొలి చిత్రానికి దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కథ, చిత్రీకరణకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞను తొలి సినిమాతోనే ప్రత్యేకంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో బాలకృష్ణ కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణ వాణిజ్య కథకు భిన్నంగా భారీ సామాజిక కల్పిత కథాంశాన్ని ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ తుది కథా రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మోక్షజ్ఞకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చేలా పాత్రను తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
ఈ చిత్రంలో కాలానికి సంబంధించిన విభిన్న అంశాలు, పునర్జన్మలు, అద్భుతమైన ప్రపంచ నిర్మాణం ప్రధానంగా ఉండనున్నాయని టాక్‌ వినిపిస్తోంది. భారీ దృశ్య ప్రభావాలతో పాటు భావోద్వేగాలు, పోరాట సన్నివేశాలు, వాణిజ్య అంశాలను మేళవించనున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
అయితే దర్శకుడు వశిష్ఠ ఎంపిక, కథాంశం, షూటింగ్‌ తేదీ, బాలకృష్ణ పాత్రపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.