వెయ్యి గ్రామాలు దాటిన భూ రీ-సర్వే

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీ-సర్వే

* 2,720 గ్రామాల్లో సమగ్ర సర్వేకు శ్రీకారం
* 416 గ్రామాల్లో పూర్తయిన సర్వే ప్రక్రియ
* భూ యజమానుల అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం
* పొరపాట్లకు తావులేకుండా చూడాలన్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (సేనాని ప్రతినిధి): తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వేలో జరిగే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో మరో భూ వివాదానికి కారణం కాకూడదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ కీలక మైలురాయిని దాటిందని, 416 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వేగంతో పాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
సచివాలయంలో మంగళవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో సర్వే ప్రారంభించే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని, అందులోని భూముల విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, సరిహద్దుల వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే క్షేత్రస్థాయి ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన అనంతరం భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
సర్వే విధానం, నోటీసుల జారీ, అభ్యంతరాల నమోదు, వాటి పరిష్కారంపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. సర్వే కేవలం ప్రభుత్వ రికార్డుల నవీకరణకే పరిమితం కాకుండా ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించే ప్రక్రియగా ఉండాలని చెప్పారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు కల్పించే భూధార్‌ సంఖ్యల కేటాయింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చిన్న లోపాలు గుర్తించినా వెంటనే సరిదిద్దాలని, భవిష్యత్తులో కొత్త భూ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భూముల హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణాలకు సంబంధించి తరతరాలుగా కొనసాగుతున్న సమస్యలకు ఈ రీ-సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి సూచించారు. భూ యజమానుల సంతృప్తే సర్వే విజయానికి ప్రామాణికంగా ఉండాలని, రైతులకు పూర్తి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. సర్వే పురోగతి, క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ సహాయ సంచాలకులతో ప్రత్యేక దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా పురోగతిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు. సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సంయుక్త సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.